శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 19 ఏప్రియల్ 2016 (13:20 IST)

కుమార్తె, అత్తను పొట్టనబెట్టుకున్న మహిళ : ప్రియుడికి మరణశిక్ష-ప్రియురాలికి జీవితఖైదు!

పేగు బంధాన్ని కూడా మర్చిపోయి తన మూడేళ్ళ కూతురిని చంపించింది ఓ ఐటీ ఉద్యోగిని. కూతురితోపాటు అత్తనూ కూడా అతిదారుణంగా హత్య చేసింది. భర్తపై హత్యాయత్నానికి ఒడిగట్టింది. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఈ కిరాతకం పాల్పడినందుకు ఆమె ప్రియుడికి కోర్టు మరణశిక్ష విధించింది. ఆమెకు జీవిత ఖైదు శిక్షను కోర్టు విధించింది. 2014లో తిరువనంతపురంలో సంచలనం సృష్టించిన ఈ హత్యల కేసులో తిరువనంతపురం ప్రిన్సిపాల్‌ సెషన్స్‌ జడ్జి వీ షెర్సీ సోమవారం ఈ మేరకు శిక్షలు ఖరారు చేశారు. నిందితులిద్దరిపై చేరో రూ. 50 లక్షల జరిమానా విధించి తీర్పునిచ్చారు. 
 
పూర్తి వివరాలను పరిశీలిస్తే తిరువనంతపురంలోని టెక్నో పార్కు సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న నినో మాథ్యూ, అను శాంతి మధ్య అక్రమ సంబంధం కొద్దికాలంగా సాగుతోంది. తమ బంధానికి తన కుటుంబం అడ్డుగా ఉన్నారనే కారణంతో రెండేళ్ల కిందట అను మూడేళ్ల కూతురు స్వస్తికను, ఆమె అత్తమ్మ ఒమనా (60)ను దారుణంగా ప్రియుడు నినోమాథ్యూ చంపేశాడు. అను శాంతి భర్త లిజేష్‌ను కూడా చంపేందుకు ప్రయత్నాలు చేశారు కాని ప్రయత్నాలు విఫలం కావడంతో లిజేష్‌ తీవ్ర గాయాలతో బతికి బయటపడ్డాడు. అనుశాంతి సహకారంతోనే నినో ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. ఇంతటి దారుణానికి పాల్పడిన నినో మాథ్యూకు మరణశిక్ష విధిస్తున్నానని జడ్జి వీ షెర్సీ స్పష్టం చేశారు.
 
నిందితులు ఇద్దరికి కలిపి విధించిన రూ. కోటి జరిమానాలో కూతురిని కోల్పోయిన అను భర్త లిజేష్‌కు రూ. 50 లక్షలు, భార్యను కోల్పోయిన అను మామ థంకప్పన్ చెట్టియార్‌కు రూ. 30 లక్షలు పరిహారం చెల్లించాలని జడ్జి ఆదేశించారు. అనుశాంతి 'అమ్మతనానికి మచ్చ కలిగించిందని', తన కోరిక తీర్చుకోవడానికి మూడేళ్ల కూతురిని, 60 ఏళ్లు పై బడిన వృద్ధురాలిని దారుణంగా చంపించిందని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.