శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 జూన్ 2020 (14:18 IST)

బీజింగ్‌లో కరోనా వైరస్ కేసులు - లాక్డౌన్ దిశగా అడుగులు

కరోనా వైరస్ పురుడు పోసుకున్న చైనాలో కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. వుహాన్ కేంద్రంగా ఈ వైరస్ పురుడు పోసుకుంది. కానీ, అక్కడ తగ్గుముఖం పట్టింది. అయితే, చైనా రాజధాని బీజింగ్‌లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో బీజింగ్ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేయాలని భావిస్తున్నారు. 
 
నిజానికి మూడు నెలల క్రితం చైనా, వుహాన్ నగరాన్ని ఈ వైరస్ వణికించింది. ఆపై ప్రపంచదేశాలపై పడింది. కానీ, చైనాలో తగ్గిందనుకున్న కరోనా ఉద్ధృతి మళ్లీ మొదలైంది. రాజధాని బీజింగ్ లో కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కావడం అధికార వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. దాంతో కరోనా సోకిన వారితో సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వారందరికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. 
 
గత రెండు నెలలుగా కొత్త కేసులు లేవని భావిస్తున్న అధికారులు రెండ్రోజుల వ్యవధిలో 11 పాజిటివ్ కేసులు రావడంతో కరోనా రెండో విజృంభణ తప్పదని భావిస్తున్నారు. దీంతో మరోసారి లాక్డౌన్ విధించే దిశగా అధికార యంత్రాంగం వ్యూహరచన చేస్తోంది. అయితే మరికొన్నిరోజుల పాటు ఇదే తరహాలో కేసులు వస్తే లాక్డౌన్ తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి.