గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 3 జనవరి 2019 (13:41 IST)

సిడ్నీ టెస్టు.. విరాట్ కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు.. తొలిరోజు ఆటలో?

భారత్-ఆస్ట్రేలియాల మధ్య సిడ్నీలో మొదలైన నాలుగు టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ కేవలం 23 పరుగులు సాధించి.. అవుటైనప్పటికీ.. దిగ్గజ క్రికెటర్లు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్‌లను అధిగమించాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 19వేల పరుగులు సాధించిన క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు సాధించాడు. 
 
అంతర్జాతీయ క్రికెట్‌లో 19 వేల పరుగులు చేసిన 12వ క్రికెటర్‌గా, భారత్ తరఫున సచిన్, ద్రవిడ్ తర్వాత మూడో బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నిలిచాడు. విరాట్ కోహ్లీ కేవలం 399 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అధిగమించాడు. ఫలితంగా సచిన్ (432ఇన్నింగ్స్),  లారా (433), పాంటింగ్ (444), కలిస్ (458)లను కోహ్లీ అధిగమించాడు.
 
ఇక సిడ్నీలో జరుగుతున్న ఈ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌‍లో తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 90 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. దీంతో తొలిరోజు మొత్తం ఆసీస్ పై భారత్ పైచేయి సాధించింది. పుజారా (130 పరుగులు-250 బంతుల్లో 16 ఫోర్లతో) శతకం సాధించాడు. మయాంక్ (77 పరుగులతో) అర్థ శతకం సాధించాడు. 
 
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. ఓపెనర్ లోకేష్ రాహుల్ (9) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. పుజారాతో కలిసి మరో ఓపెనర్‌ మయాంక్ అగర్వాల్‌ స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు. అర్థశతకం పూర్తి చేసుకుని ధాటిగా ఆడుతున్న మయాంక్ అగర్వాల్‌ (77)ను నాథన్‌ లైయన్‌ ఔట్‌ చేశాడు. కోహ్లీ (23), రహానే (18) పరుగులు సాధించారు. ఆట ముగిసే సమయానికి క్రీజ్ లో పుజారా (130), విహారి (39)లు ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్‌ రెండు.. స్టార్క్, లైయన్‌ చెరో వికెట్ తీశారు.