శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 21 నవంబరు 2015 (11:30 IST)

సౌతాఫ్రికాను ఓడించేందుకు స్పిన్‌ పిచ్‌లే కావాలంటున్న భారత్ : మంజ్రేకర్

పటిష్టమైన దక్షిణాఫ్రికాను ఓడించాలంటే స్పిన్ పిచ్‌లో కావాలని టీమిండియా కోరుకుంటోందని భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ భారత్ కోరుకుంటున్నట్టుగా మిగిలిన రెండు టెస్ట్ మ్యాచ్‌లకు కూడా స్పిన్ పిచ్‌లనే తయారు చేస్తే మాత్రం ఖచ్చితంగా సౌతాఫ్రికా విజయం సాధించే పరిస్థితులే లేవని ఆయన జోస్యం చెప్పారు. 
 
‘భారత ఆటగాళ్లను ఆశ్చర్యపరిచేందుకు మాంటీ పనేసర్‌, గ్రేమ్‌ స్వాన్‌ వంటి స్పిన్నర్లు ఇప్పుడు సఫారీ జట్టులో లేరు. డివిల్లీర్స్‌, ఆమ్లా, కొన్నిసార్లు ఎల్గర్‌ మినహా వారి బ్యాట్స్‌మెన్‌లో స్పిన్‌ను ఎదుర్కొనే సామర్థ్యం లేదు. బంతి స్పిన్‌ అయితే భారత తన అవకాశాలను రెట్టింపుచేసుకోగలద’ని మంజ్రేకర్‌ చెప్పుకొచ్చాడు. మూడో టెస్టుకు ఆతిథ్యం ఇచ్చే నాగ్‌పూర్‌ పిచ్‌ వాస్తవానికి బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందన్నాడు. అయితే ఈ మ్యాచ్‌కూ స్పిన్‌ వికెట్టే దర్శనమిస్తుందన్నారు. 
 
2010లో ఇక్కడ ఆడిన టెస్టులో ఆమ్లా (253 నాటౌట్‌) అజేయ డబుల్‌ సెంచరీతో రాణించడంతో సఫారీలు తొలి ఇన్నింగ్స్‌ను 558/6 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసిన విషయాన్ని మంజ్రేకర్ గుర్తుచేశారు. స్టెయిన్‌ మొత్తం పది వికెట్లతో విజృంభించడంతో భారత ఇన్నింగ్స్‌ ఆరు పరుగుల తేడాతో ఓడిపోయిందని చెప్పాడు.