శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 5 మే 2015 (11:46 IST)

ఐపీఎల్-8: రాయల్ ఛాలెంజర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం!

ఐపీఎల్-8లో భాగంగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 24 పరుగుల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. చెన్నై విసిరిన 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగళూర్ వరుస వికెట్లను చేజార్చుకుని పరాజయం పాలైంది. బెంగళూర్ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ(48), ఏబీ డివిలియర్స్(21), దినేశ్ కార్తీక్(23) పరుగుల మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు. 
 
ఏడుగురు బెంగళూర్ ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో బెంగళూర్ 19.4 ఓవర్లలో 124 పరుగులకే చాపచుట్టేసింది. చెన్నై బౌలర్లలో ఆశిష్ నెహ్రా మూడు వికెట్లు తీసి మరోసారి సత్తాచాటగా, ఐశ్వర్ పాండే, బ్రేవో లకు చెరో రెండు వికెట్లు, మోహిత్ శర్మకు ఒక వికెట్ దక్కింది.
 
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నచెన్నై ఆదిలోనే తడబడింది. స్కోరు బోర్డుపై పరుగులేవీ లేకుండానే డ్వేన్ స్మిత్ వికెట్‌ను కోల్పోయింది. అనంతరం బ్రెండన్ మెకల్లమ్(20) పెవిలియన్ కు చేరి నిరాశపరిచాడు. కాగా సురేష్ రైనా, డుప్లెసిస్ జోడి కాసేపు బెంగళూర్ బౌలర్లను ప్రతిఘటించడంతో చెన్నై స్కోరు బోర్డు ముందుకు కదిలింది. డు ప్లెసిస్(24), సురేష్ రైనా(52) పరుగులు చేసిన అనంతరం అవుటయ్యారు.
 
ఆ తరువాత రవీంద్ర జడేజా(3), మహేంద్ర సింగ్ ధోనీ(29) నిష్క్రమించడంతో చెన్నై రక్షణాత్మక ధోరణి కొనసాగించింది. చెన్నై మిగతా ఆటగాళ్లలో నేగీ(13), బ్రేవో(2) పరుగులు చేయడంతో చెన్నై నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. అయితే చెన్నై బౌలర్లు మెరుగ్గా రాణించడం ద్వారా రాయల్ చాలెంజర్స్‌పై విజయం సాధించింది.