శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By కుమార్
Last Updated : సోమవారం, 18 మార్చి 2019 (17:48 IST)

బంగ్లా క్రికెటర్లు మసీదుకు వెళ్తే కాల్పులు.. తృటిలో తప్పించుకున్నారు.. (video)

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. అందులో భాగంగా శనివారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌కు సమయాత్తం అవుతున్న బంగ్లా ఆటగాళ్లు ప్రార్థనల కోసం క్రిస్ట్‌చర్చ్‌ సెంట్రల్‌ సిటీలోని హగ్లీపార్క్‌ మసీదుకు వెళ్లగా.. అక్కడ కాల్పులు ఘటన చోటుచేసుకుంది.


ఈ ఘటనలో 8 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. హగ్లీపార్క్‌లో సమీపంలోని రెండు మజీదులపై ప్రార్థన సమయంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారని, దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. 
 
కాల్పుల శబ్దం విన్న ఆటగాళ్లు పరుగులు తీసారు. కాల్పుల నుండి తాను సురక్షితంగా బయటపడ్డామని ఆ జట్టు ఆటగాడు తమీమ్‌ ఇక్బాల్‌ ట్వీట్‌ చేసాడు. ఈ కాల్పుల ఘటన జరిగిన సమీపంలోనే తమ ఆటగాళ్లు ఉన్నారని, కానీ  ఆ దేవుడి దయ వల్ల ఎలాంటి నష్టం జరగలేదని బంగ్లాదేశ్‌ కోచ్‌ మీడియాకు తెలిపాడు. ఈ ఘటనతో ఆటగాళ్లు వణికిపోయారన్నాడు. ఆ అల్లానే తమని రక్షించారని ముష్ఫికుర్‌ రహీమ్‌ ట్వీట్‌ చేశాడు. తాము చాలా అదృష్టవంతులమని, జీవితంలో మళ్లీ ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడకూడదని పేర్కొన్నాడు. 
 
ఈ ఘటనతో రెండు మసీదులు రక్తసిక్తమయ్యాయని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జనాలు పరుగు పెట్టారని తెలిపింది. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. క్రిస్ట్‌చర్చ్‌ సిటీలోని ప్రజలెవరు బయటకు రావద్దని సూచించారు. మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ప్రాణనష్టం ఎక్కువగానే ఉందని తెలుస్తోంది.