శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 19 మార్చి 2015 (20:20 IST)

భారత్ సెమీఫైనల్ ప్రత్యర్థి ఎవరు...? ఆస్ట్రేలియానా..పాక్‌స్తానా..?!

వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌ను భారత్ చిత్తు చేస్తూ 109 పరుగుల భారీ విజయాన్ని సాధించి రికార్డులు కూడా సృష్టించింది. వరుసగా 7 మ్యాచుల్లో ఘన విజయం సాధించిన ఇండియా ఈ విజయంతో సెమీస్‌కు దూసుకెళ్లింది. తొలుత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసిన టీమ్ ఇండియా, బంగ్లాదేశ్‌ ముందు 303 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఐతే బంగ్లాదేశ్ 193 పరుగులకే బోర్లా పడటంతో 109 పరుగుల భారీ విజయం భారత్ కైవసమైంది.

కాగా రోహిత్ శర్మ 137 పరుగులతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం సాధించడంపై ట్వీట్ల వర్షం కురుస్తోంది. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ఇంకా టీమిండియా ప్రదర్శనపై ట్వీట్ల వెల్లువ వస్తూనే ఉంది.
 
ఇక రేపు ఆస్ట్రేలియా - పాకిస్తాన్ జట్ల మధ్య మూడవ క్వార్టర్ ఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజేతగా నిలుస్తుందో ఆ జట్టుతో టీమ్ ఇండియా తలపడాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో ఏ జట్టు అయితే భారత్ సునాయాస విజయాన్ని సొంతం చేసుకుంటుందన్న దానిపై విశ్లేషకులు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. వారు చెప్పిన ప్రకారం పాకిస్తాన్ జట్టు అయితే విజయం నల్లేరు మీద నడకే అంటున్నారు. అదే ఆస్ట్రేలియా అయితే కష్టపడాల్సి వస్తుందనీ, ఎందుకంటే ఆసీస్ సొంత గడ్డపై ఆ జట్టును ఎదుర్కోవడం కష్టసాధ్యమని వారు చెపుతున్నారు. 
 
ఇదిలావుంటే అసలు ప్రపంచ కప్ ను ఎగరేసుకుని వెళ్లగల జట్టు ఏదీ అనే చర్చ కూడా నడుస్తోంది సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో. ఆ వివరాలను చూస్తుంటే... వరల్డ్ కప్ ఎగరేసుకెళ్లగల జట్లలో భారత్ కు 4వ స్థానాన్ని కట్టబెట్టారు. ఇక మొదటి స్థానంలో ఆస్ట్రేలియా ఉండగా, రెండవ స్థానంలో న్యూజీలాండ్, మూడవ స్థానంలో దక్షిణాఫ్రికాను నిలబెట్టారు. మరి వీరి లెక్కలు ఎంతవరకు కరెక్టవుతాయో వెయిట్ అండ్ సీ.