శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (14:10 IST)

ఐసీసీ అధ్యక్ష పదవికి ముస్తఫా కమల్ రాజీనామా...

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్ష పదవికి ముస్తఫా కమల్ రాజీనామా బుధవారం చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన ముస్తఫా ఐసీసీ నిర్ణయాలపై బహిరంగంగానే తన అసంతృప్తి వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రపంచ కప్ మెగా టోర్నీలో భాగంగా భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అంపైర్లు తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగానే తన దేశ జట్టు ఓటమిపాలైందని కమల్ వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. 
 
ఆ సమయంలో తన పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. దీనిపై తీవ్రమైన దుమారం చెలరేగడంతో ఆయన మాట మార్చారు. ఆ తర్వాత విశ్వవిజేతగా అవతరించిన క్రికెట్ జట్టుకు ట్రోఫీని అందజేసే విషయంలో మళ్లీ వివాదం చెలరేగింది. కొత్తగా సృష్టించిన ఐసీసీ ఛైర్మన్ ముందుకొచ్చి ఈ ట్రోఫీని అందజేశారు. దీంతో ఐసీసీ అధ్యక్ష పదవి డమ్మీగా మారింది. ఈ వ్యవహారంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన... బంగ్లాదేశ్‌కు చేరుకుని తన పదవికి రాజీనామా చేశారు.