శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 12 ఏప్రియల్ 2015 (12:45 IST)

ఐపీఎల్-8 : పోరాడి ఓడిన కోల్‌కతా.. గేల్ రాణింపుతో బెంగుళూరు బోణీ!

స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ - 8 ఎడిషన్‌ పోటీల్లో భాగంగా శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు తుదికంటా పోరాడి ఓడింది. బెంగుళూరు జట్టులో విధ్వంసక వీరుడు క్రిస్‌ గేల్‌ 56 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేసి బెంగళూరుకు తొలి విజయాన్ని అందించాడు. 
 
కోల్‌కతా నిర్ధేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 19 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సహచరులంతా వెనుదిరుగుతున్నా ఒంటరి పోరాటం చేసిన గేల్‌ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ఏబీ డివిల్లీర్స్‌ (13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28) రాణించాడు. 64 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గేల్‌ ఇచ్చిన క్యాచ్‌ను మోర్నె మోర్కెల్‌ జారవిడవడంతో కోల్‌కతాకు మ్యాచ్‌ దూరమైంది. 
 
అనంతరం గేల్‌ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. విజయానికి 10 బంతుల్లో 7 పరుగులు కావాల్సిన సమయంలో గేల్‌ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో రనౌటయ్యాడు. అయితే చివర్లో హర్షల్‌ పటేల్‌ (9 నాటౌట్‌), అబు నెచిమ్‌ (5 నాటౌట్‌) బెంగళూరుకు మరో చాన్స్‌ ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించేశారు. కోల్‌కతా బౌలర్లలో యూసుఫ్‌ పఠాన్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. మోర్కెల్‌, కరియప్ప, షకీబల్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. ఇక వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడిన గేల్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. 
 
అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 177 పరుగులు చేసింది. కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ (46 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 58) అర్థ సెంచరీ సాధించగా, చివర్లో ఆండ్రీ రస్సెల్‌ (17 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 నాటౌట్‌) మెరుపులు మెరిపించాడు. రాబిన్‌ ఊతప్ప 35 రన్స్‌ చేశాడు. బెంగళూరు బౌలర్లలో యజ్వేంద్ర చాహల్‌, అబు నెచిమ్‌, వరుణ్‌ ఆరోన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.