శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 4 మే 2015 (12:04 IST)

ఐపీఎల్ -8: 14 పరుగుల తేడాతో గెలుపు.. ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం!

ఐపీఎల్-8వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ అదరగొడుతోంది. టోర్నీప్రారంభంలో అదరగొట్టిన షేన్ వాట్సన్ సేన.., ఆ తర్వాత పరాజయాలను కూడా చవిచూసింది. తాజాగా ఆదివారం ముంబైలో ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు మళ్లీ గాడిలో పడింది. 14 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసిన రాయల్స్ జట్టు పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకింది. 
 
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఓపెనర్ గా వచ్చిన అజింక్యా రెహానే (91) చివరి దాకా ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కెప్టెన్ వాట్సన్ (21) ఔటైన తర్వాత రెహానేతో జతకలిసిన కరుణ్ నాయర్ (61) కూడా బ్యాట్ ఝుళిపించాడు. రెహానే, నాయర్ వీరవిహారంతో రాయల్స్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిని నిలువరించడంలో ఢిల్లీ బౌలర్లు పూర్తిగా ఫెయిలయ్యారు. 
 
ఆ తర్వాత 190 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 175 పరుగులు చేసి పరాజయం పాలైంది. జేపీ డుమిని(56) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినా, ఆ జట్టు స్టార్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ (22) విఫలమయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్లంతా స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. రాయల్స్ బౌలర్లు వరుసగా వికెట్లు తీయడంతో ఏ దశలోనూ ఢిల్లీ విజయం సాధించే దిశగా పోరు సాగించలేదు. 20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయిన ఢిల్లీ 175 పరుగులకే తోక ముడిచింది. దీంతో ఢిల్లీపై రాయల్స్ జట్టు సునాయాసంగానే విజయం సాధించింది.