బుమ్రా అదుర్స్.. హ్యాట్రిక్ రికార్డ్.. వరుస బంతుల్లో మూడు వికెట్లు
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా అదరగొట్టేసింది. టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా హ్యాట్రిక్ వికెట్లతో అరుదైన ఫీట్ సాధించాడు. వరుస బంతుల్లో మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్ రికార్డు సృష్టించాడు.
అదేవిధంగా హనుమ విహారీ టెస్టుల్లో తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. అలాగే ఇషాంత్ శర్మ అర్థ శతకాన్ని బాదాడు. ఫలితంగా మ్యాచ్ పూర్తిగా టీమిండియాకు అనుకూలంగా మారిపోయింది. దీంతో రెండో టెస్ట్, రెండో రోజు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీ బ్రేక్‌కి 416 పరుగులు సాధించింది.
ఇక టీమిండియా ఆటగాళ్లు సాధించిన రికార్డుల సంగతికి వస్తే... బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మ్యాచ్ తొమ్మిదో ఓవర్‌లో రెండో బంతికి డారెన్ బ్రావో (4), స్లిప్‌లో కేఎల్ రాహుల్ చేతికి చిక్కగా, మూడో బంతికి బ్రూక్స్(0) ఎల్బీగా పెవిలియన్ బాట పట్టాడు. నాలుగో బంతికి చేజ్(0) కూడా ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. దాంతో అరుదైన రికార్డును బుమ్రా తన ఖాతాలో వేసుకున్నట్లైంది. అంతకుముందు ఏడో ఓవర్‌లో ఓపెనర్ క్యాంప్‌బెల్(2) కూడా బుమ్రా బౌలింగ్‌లోనే పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
నిజానికి నాలుగో బంతి చేజ్ బ్యాట్‌ను తాకిందేమోననే అనుమానంతో బుమ్రా అప్పీలు చేయలేదు. కెప్టెన్ కోహ్లీ మాత్రం బంతి ప్యాడ్‌ను తాకిందంటూ అప్పీలు చేశాడు. ఫీల్డ్ అంపైర్ ఒప్పుకోలేదు. దాంతో థర్డ్ అంపైర్‌ని కోరాడు కోహ్లీ. టీవీ స్క్రీన్‌లో బంతి చేజ్ ప్యాడ్‌ను తాకినట్లు కనిపించింది. ఫలితంగా బుమ్రా అకౌంట్‌లో హ్యాట్రిక్ రికార్డు నమోదైంది. బుమ్రా బౌలింగ్ మ్యాజిక్ వల్ల తక్కువ రన్స్‌కే... వెస్టిండీస్ 4 వికెట్లు కోల్పోయినట్లైంది.
టెస్ట్ క్రికెట్‌లో ఇండియా నుంచీ ఇది మూడో హ్యాట్రిక్ రికార్డు. ఇదివరకు 2001లో స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ సాధించగా, 2006లో ఇర్ఫాన్ పఠాన్ పాక్‌పై హ్యాట్రిక్ కొట్టాడు. 13 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ ఫీట్ చేసి చూపించి... అభిమానులను సంబరాల్లో ముంచెత్తాడు.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది 44వ హ్యాట్రిక్. 2017లో సౌతాఫ్రికాపై ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ ఈ రికార్డు సాధించాడు. ఆ తర్వాత మళ్లీ ఈ ఫీట్ చేయగలిగింది బుమ్రానే. ఇదే టెస్టులో హనుమ విహారీ... తన మొదటి టెస్ట్ సెంచరీని సాధించాడు.