శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (13:05 IST)

వాటర్ బర్త్ ద్వారా జాంటీ రోడ్స్ దంపతులకు పాపాయి!: వాటర్ బర్త్ అంటే?

ఐపీఎల్ సీజన్‌లో బిజీగా ఉన్న సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ సతీమణి మిలేనీ జెన్నీ పండంటి పాపాయికి జన్మనిచ్చింది. ముంబై, శాంతా క్రజ్‌లోని ఓ ఆస్పత్రిలో వాటర్ బర్త్ విధానం ద్వారా జెన్నీకి పాపాయి పుట్టింది. గురువారం మధ్యాహ్నం 3:29 గంటలకు పాప పుట్టిందని, 3.71 కిలోల బరువుందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
 
బిడ్డకు జన్మనిచ్చేందుకు వారు 'వాటర్ బర్త్' విధానాన్ని ఎంచుకున్నారని, అందుకోసం మూడు నెలలుగా శిక్షణ తీసుకుంటున్నారని వివరించారు. కాగా, తల్లికి, బిడ్డకు ఎంతో మేలు కలిగే 'వాటర్ బర్త్' విధానం ఇండియాలో అంత ప్రాచుర్యం పొందలేదు. అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో మాత్రం అత్యధిక జననాలు ఈ విధానంలోనే జరుగుతున్నాయి.
 
వాటర్ బర్త్ అంటే.. వాటర్ టబ్ అంటే మన బాత్రూమ్‌లో ఉండే బాత్ టబ్ లాంటిదేగాని ఇంకాస్త పెద్దగా, గుండ్రంగా ఉంటుంది. దీని ఎత్తును కూడా మనకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు. ఈ టబ్ నిండా క్రిమిరహితం చేసిన గోరువెచ్చని నీటిని నింపుతారు. ఈ నీరు చల్లబడిపోకుండా నిరంతరం వేడినీటితో నింపుతూ ఉంటారు. మరోపక్క చల్లబడిన నీటిని తోడేస్తారు. 
 
తల్లిని, బిడ్డను మానిటరింగ్ చేయడానికి దీని చుట్టూ పరికరాలు అమర్చబడి ఉంటాయి. నొప్పులు మొదలవుతున్నాయనగానే అందులో కూర్చోబెడతారు. సాధారణ ప్రసవానికి, దీనికి పెద్ద తేడా ఏమీ ఉండదు. సాధారణ ప్రసవం అయితే ఆస్పత్రి బెడ్ మీద చేస్తారు. ఇక్కడ ప్రసవం నీటిలో జరుగుతుంది. సాధారణంగా బెడ్ మీద జరిగే ప్రసవం కన్నా ఇలా నీటిలో జరిగే ప్రసవం వల్ల ప్రయోజనం ఎక్కువ. 
 
దీనిలో గర్భిణి చాలా సౌకర్యవంతంగా, రిలాక్స్‌డ్‌గా కూర్చుని ఉంటుంది. ఒత్తిడి ఉండదు. నీటిలో కూర్చోవడం వల్ల తమకు సౌకర్యవంతంగా, అనువుగా ఉండేలా కూర్చోగలుగుతారు. కదలగలుగుతారు. సాధారణ ప్రసవంతో పోలిస్తే నీటిలో ప్రసవించడం వల్ల బిడ్డ చాలా సులువుగా ప్రసవిస్తుంది. బిడ్డ బయటకు వచ్చే సమయంలో వేడి నీటి వల్ల పెరీనియం పొర సాగుతుంది. కాబట్టి సమస్యల్లేకుండా ప్రసవం జరిగిపోతుంది. నీటిలోనే ప్రసవించడం ఇష్టం లేనివాళ్లకు బిడ్డ బయటకు రాబోతున్న సమయంలో వెంటనే పడక మీదకు మార్చి నార్మల్‌గా ప్రసవం చేయగల అవకాశం కూడా ఉంది. 
 
కాగా.. నీటిలో ప్రసవించడం బాగానే ఉంటుంది గాని గర్భిణులైన ప్రతి ఒక్కరికీ ఇది సరిపోదు. అధిక రక్తపోటు, మధుమేహం, గుండెకు సంబంధించిన సమస్యలున్నవాళ్లు, అంతకు ముందు సిజేరియన్ అయినవాళ్లకి సాధారణంగా దీన్ని సూచించరు. ఎందుకంటే కడుపులో బిడ్డ మానిటరింగ్‌తో పాటు తల్లిని కూడా మానిటర్ చేయడం కష్టం అవుతుంది. ప్లసెంటా సరైన స్థానంలో లేకపోయినా, నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే సూచనలున్నవాళ్లకు ఇది శ్రేయస్కరం కాదు. కవలపిల్లలను కనబోయే వాళ్లకు కూడా దీన్ని సూచించరు.