ఐపీఎల్ విస్తరణకు సరైన సమయం ఇదే : రాహుల్ ద్రవిడ్

rahul dravid
ఠాగూర్| Last Updated: ఆదివారం, 15 నవంబరు 2020 (13:40 IST)
ప్రపంచ వ్యాప్తంగా ప్రజాధారణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను విస్తరించేందుకు సమయం ఆసన్నమైందని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ద్రవిడ్ జాతీయ క్రికెట్ అకాడెమీ(ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

ఐపీఎల్ విస్తరణపై రాహుల్ ద్రవిడ్ స్పందిస్తూ, మన దేశంలో అపార నైపుణ్యం దాగి ఉందని యువ ఆటగాళ్లలోని ప్రతిభ వెలుగులోకి రావాలంటే కొత్త ఫ్రాంచైజీలు అవసరమన్నారు. 'నైపుణ్యపరంగా చూసుకుంటే ఐపీఎల్‌ విస్తరణకు సిద్ధంగా ఉందని భావిస్తున్నా. తుది జట్టులో ఆడేందుకు అవకాశం లభించని ప్రతిభావంతులైన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. మరిన్ని జట్లు ఉంటే బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లందరికీ అవకాశాలు లభిస్తాయి. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం బీసీసీఐకే ఉందన్నారు.

వచ్చే 2021 సీజన్‌లో తొమ్మిది జట్ల ఐపీఎల్‌ నిర్వహించడం సాధ్యమే. కాకపోతే మధ్యాహ్నం మ్యాచ్‌ల సంఖ్య పెరుగుతుంది. యువ ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడాన్ని ఆస్వాదిస్తా. ఐపీఎల్‌ కారణంగా ఎంతోమంది వెలుగులోకి వచ్చారు. కోచ్‌లు ఎన్ని విషయాలు చెప్పినా.. అనుభవం నేర్పే పాఠాలు చాలా విలువైనవి. ప్రపంచ ఉత్తమ ఆటగాళ్లైన విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌తో కలిసి బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు దేవదత్‌ పడిక్కల్‌ చాలా నేర్చుకొని ఉంటాడు.

అలాగే వార్నర్‌, విలియమ్సన్‌ సలహాలతో నటరాజన్‌ రాటుదేలి ఉంటాడు. ఇలాగే మరింత మందికి అవకాశం రావాలంటే ఫ్రాంచైజీల సంఖ్య పెంచడమే మంచింది. ఇక లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టు పటిష్టంగా కనిపించడానికి వారి వద్ద బలమైన కోర్‌ గ్రూప్‌ ఉండటమే ప్రధాన కారణమన్నారు.దీనిపై మరింత చదవండి :