శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 18 ఫిబ్రవరి 2015 (11:33 IST)

పాకిస్థాన్ క్రికెటర్లు బూతులు తిడుతున్నారు.. ఫీల్డింగ్ కోచ్ ఫిర్యాదు

తమకు పాఠాలు నేర్పించే కోచ్‌లను పాకిస్థాన్ క్రికెటర్లు బూతులు తిడుతున్నారట. మున్ముందు కూడా ఇదేవిధంగా కొనసాగినట్టయితే కోచ్ పదవి నుంచి తప్పుకుంటానని ఆయన హెచ్చరిస్తూ తనను బూతులు తిట్టిన క్రికెటర్లపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్ ఫిర్యాదు చేశాడు. 
 
ప్రస్తుతం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు ఆతిథ్యమిస్తున్న వరల్డ్ కప్‌లో రాణించేందుకు పాక్ క్రికెటర్లు ముమ్మరంగా సాధన చేస్తున్నారు. అయితే, వివాదాలకు కేంద్ర బిందువులుగా ఉండే పాక్ క్రికెటర్లు.. ప్రత్యర్థి జట్టు సభ్యులపై దురుసుగా ప్రవర్తించడలో వారు ఆసీస్ ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోరనే విషయం తెల్సిందే. 
 
అలాగే, ఇక తమకు పాఠాలు నేర్పేందుకు వస్తున్న కోచ్‌ను కూడా వారు వదిలిపెట్టడం లేదు. పాక్ ఫీల్డింగ్ కోచ్ గ్రాంట్ లూడెన్‌ కొనసాగుతున్నారు. ఈయనను పాక్ క్రికెటర్లు అసభ్యపదజాలంతో దూషించారు. అంతేకాక ప్రాక్టీస్ సెషన్‌లో ఆయనకు ఏమాత్రం సహకరించడం లేదట. 
 
మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సందర్భంగా షాహిద్ అఫ్రిదీతో పాటు అహ్మద్ షెహజాద్, ఉమర్ అక్మల్‌లు లూడెన్‌ను అసభ్య పదజాలంతో తిట్టిపోశారట. దీంతో మనసునొచ్చుకున్న లూడెన్ వెనువెంటనే పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ షహర్యాన్ ఖాన్‌కు ఫిర్యాదు చేశాడు. ఆటగాళ్లను నియంత్రించకుంటే తాను తప్పుకుంటానంటూ లూడెన్ హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం.