శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 13 జులై 2015 (09:43 IST)

హరారే రెండో వన్డే : జింబాబ్వే చిత్తు.. రెహానే సేన అదుర్స్...

హరారే వేదికగా ఆదివారం జరిగిన రెండే వన్డే మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0తో ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. పైగా మరో మ్యాచ్ మిగిలివుండగానే, సిరీస్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో రెహానే సేన బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో అదరగొట్టడంతో మ్యాచ్‌ ఏకపక్షమైంది. అయితే, జింబాబ్వే జట్టు ఆటగాడు సిబందా ఒంటరి పోరాటం చేసినా ఆతిథ్య జట్టుకు ఓటమి తప్పలేదు.
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు పర్యాటక జట్టుకు బ్యాటింగ్ అప్పగించింది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు రహానే 63, మురళీ విజయ్ 72 పరుగులతో రాణించి ఓపెనింగ్ భాగస్వామ్యంగా 112 పరుగులు జోడించారు. 
 
ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన అంబటి రాయుడు 41, మనోజ్ తివారీ 22, కీపర్ ఊతప్ప 13, స్టువర్ట్ బిన్నీ 25, జాదవ్ 16, హర్భజన్ 5 చొప్పున పరుగులు చేయగా, అదనపు పరుగుల రూపంలో 13 రన్స్ వచ్చాయి. దీంతో భారత్ 50 ఓవర్లలో 5.42 రన్‌రేట్‌తో 271 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో మెజ్డివ నాలుగు వికెట్లు తీయగా, విటోరి, తిరిపనో, చిబాబా, సికిందర్ రాజాలు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
ఆ తర్వాత జింబాబ్వే జట్టు 272 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టింది. లక్ష్య ఛేదనలో జింబాబ్వే ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. టాపార్డర్‌లో సిబంద (2), మసకద్జ (5), చిగుంబుర (9) ఘోరంగా విఫలమయ్యారు. సిబందా (72) ఒంటరి పోరాటం చేసినా అతనికి సహచరుల మద్దతు లభించలేదు. భారత బౌలర్లు భువనేశ్వర్‌ (4/33) ధాటికి జింబాబ్వే 49 ఓవర్లలో 209 పరుగులకే ఆలౌటైంది. కులకర్ణి, భజ్జీ, బిన్నీ, పటేల్‌ తలో వికెట్‌ తీశారు. విజయ్‌ 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్'గా నిలిచాడు.