శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (12:27 IST)

టీమిండియా కోచ్‌గా సచిన్ అవతారం: మూడేళ్లు సర్వీస్.. బీసీసీఐ ప్రకటన

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కోచ్‌గా అవతారమెత్తనున్నారు. నిన్నటిదాకా టీమిండియా జట్టు సభ్యుడిగా 25 ఏళ్లకు పైగా సేవలిందించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేష్ టెండూల్కర్, అదీ టీమిండియాకే కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఐపీఎల్ ముగిసిన తర్వాత సచిన్, టీమిండియా కోచ్‌గా డంకన్ ప్లెచర్ స్థానంలో బాధ్యతలు చేపడతారని బీసీసీఐ వెల్లడించింది. మూడేళ్ల పాటు జట్టు కోచ్‌గా సచిన్ కొనసాగుతారని తెలిపింది. ఈ మేరకు సచిన్‌తో ఒప్పందం కుదిరిందని కూడా పేర్కొంది. 
 
కోచ్‌గా డంకన్ ఫ్లెచర్ పదవీ కాలం ముగియనున్న తరుణంలో ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టేదెవరంటూ సాగిన ఊహగానాలకు తెరదించుతూ బీసీసీఐ చీఫ్ జగ్ మోహన్ దాల్మియా స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు.‘‘ కోచ్ పదవి కోసం పలు సంప్రదింపులు, చర్చలు జరిపిన తర్వాత బీసీసీఐ సెక్రటరీతో కలిసి వర్కింగ్ కమిటీ ముందు సచిన్ పేరును ఉంచాం. కమిటీ కూడా మా ప్రతిపాదనను ఆమోదించింది’’ అని దాల్మియా అ ప్రకటనలో పేర్కొన్నారు. ఫ్లెచర్‌కు వర్తించిన షరతులు, పరిమితులు సచిన్‌కు కూడా వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు.