శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2016 (17:08 IST)

అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ పోరు: భారత్-వెస్టిండీస్‌ల మధ్య ఢీ!

భారత్, వెస్టిండీస్ మధ్య అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ పోరు ఖరారైంది. బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్లో వెస్టిండీస్ జట్టు జయకేతనం ఎగురవేయడంతో ఆ జట్టు ఫైనల్‌కి చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 226 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ జట్టులో స్ప్రింగర్ (59) రాణించడంతో 48.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. 
 
దీంతో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విండీస్ జట్టు ఫైనల్లో దూసుకెళ్లింది. టోర్నీలో టైటిల్ ఫేవరేట్ భారత జట్టు ఇప్పటికే ఫైనల్‌లో అడుగుపెట్టిన సంగతి విదితమే. ఈ రెండు జట్ల మధ్య ఫిబ్రవరి 14న ఫైనల్ ఫైట్ జరుగనుంది.
 
కాగా ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ టోర్నీ సెమీఫైనల్లో శ్రీలంక జట్టుపై గెలిచిన భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మ్యాచులో అన్మోల్ ప్రీత్ సింగ్(72), సర్ఫరాజ్ ఖాన్(59)లు లంకను 97 పరుగుల తేడాతో ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో ఐదోసారి భారత్ ప్రపంచ కప్ ఫైనల్లో చేరిన జట్టుగా రికార్డు కెక్కింది. 2000, 2008, 2012లలో భారత్ అండర్ 19 ప్రపంచ కప్ టోర్నీలను దక్కించుకుంది.