శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 27 జూన్ 2015 (16:02 IST)

ధోనీ సినిమా ''ది అన్‌టోల్డ్ స్టోరీ'' విడుదలకు మరికొంత ఆలస్యం..

ఇటీవల జీవిత కథల ఆధారంగా తెరకెక్కే సినిమాల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే అలనాటి నటి సిల్ స్మిత జీవిత కథ ఆధారంగా ''డర్టీ పిక్చర్'' పేరుతో సినిమా తెరకెక్కి ఘన విజయం సాధించిన విషయం తెలిందే. ఆ కోవలో కాంగ్రెస్ పార్టీ దివంగత నాయకురాలు ఇందిరాగాంధీ జీవిత కథ ఆధారంగా ఒక చిత్రం, గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవిత కథ ఆధారంగా మరో చిత్రం తెరకెక్కనుంది. ఆ వరుసలో టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా ఒక సినిమా రూపొందుతోంది.
 
ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ''ఎం.ఎస్.ధోని - ది అన్‌టోల్ట్ స్టోరీ'' సినిమాలో ధోని పాత్రను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 22వ తేది విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. అయితే తాజాగా సమాచారం ప్రకారం ఈ చిత్రం విడుదలకు మరికొన్ని రోజులు సమయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పుకు గల కారణం మాత్రం తెలియరాలేదు. 
 
బంగ్లాదేశ్‌తో ఆడిన మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం పాలవడంతో, ధోనిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన ధోనీ తాను ఎన్నడూ కెప్టెన్ పదవి కావాలని కోరుకోలేదని, ఎప్పుడైనా పక్కకు తప్పుకునేందుకు సిద్ధమే అని ప్రకటించడం సంచలనం రేపింది. అయితే ధోని చిత్రాన్ని విడుదల చేయడానికి ఇది అనువైన సమయం కాదని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందువలనే ధోని చిత్రాన్ని అనుకున్న టైమ్‌లో విడుదల చేయడం లేదని సమాచారం. కాగా ధోని విజయం పొంది సంతోషంగా ఉన్న సమయంలో ఆ చిత్రాన్ని విడుదల చేయడమే మంచిదని చిత్ర యూనిట్ తలచి, సినిమా విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.