శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 26 ఆగస్టు 2014 (10:50 IST)

ధోనీ.. నీ పని మాత్రం చేసుకో.. వేలు పెడితే వేటేస్తాం : బీసీసీఐ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీకి బీసీసీఐ గట్టి వార్నింగ్ ఇచ్చింది. కోచ్ డంకన్ ఫ్లెచర్‌కు మద్దతుగా మాట్లాడినందుకు మందలించింది. జట్టు కోచ్ డంకెన్ ఫ్లెచర్ విషయంలో ధోనీ చేసిన వ్యాఖ్యను బీసీసీఐ కొట్టిపారేసింది. అది ధోనీ వ్యక్తిగత అభిప్రాయమంటూ తీసిపారేసింది. 
 
దీంతో బీసీసీఐ పెద్దలకు కెప్టెన్ ధోనీకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైనట్టు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి ధోనీకి బీసీసీఐ చాలా కాలంగా అండగా వుంది. విదేశాల్లో ఎన్ని పర్యాయాలు విఫలమైనా, ఎంత ఘోరంగా పరాజయాలను ఎదుర్కొన్నా ధోనీ కెప్టెన్సీకిగానీ, జట్టులో అతని స్థానానికిగానీ ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. 
 
ముఖ్యంగా సుప్రీంకోర్టు ఆదేశాలతో బీసీసీఐ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగిన ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఛైర్మన్ శ్రీనివాసన్‌తో ధోనీకి సత్సంబంధాలున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి శ్రీనివాసన్ యజమాని. ఆ జట్టు కెప్టెన్ ధోనీ. వారి మధ్య గాఢానుబంధాన్ని ఇవి తెలియజేస్తున్నాయి. 
 
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా దేశాల్లో పర్యటించి పరాభవాలను మూటగట్టుకున్న టీమిండియా తాజాగా ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-3 తేడాతో చేజార్చుకుంది. ఈ సిరీస్ సందర్భంగా ధోనీ తీసుకున్న పలు నిర్ణయాలపై విమర్శలు చెలరేగాయి. అయినా ధోనీని బీసీసీఐ పెద్దలు పల్లెత్తు మాట అనలేదు. 
 
కోచ్ డంకన్ ఫ్లెచర్‌కు చాలా సన్నిహితంగా ఉంటూ, అతనికి కొమ్ముకాయడం కూడా ధోనీ పట్ల బీసీసీఐ వ్యతిరేకత పెరిగింది. విదేశాల్లో భారత జట్టు వైఫల్యాలకు ధోనీ బాధ్యత వహించాలని ఎంతోమంది మాజీ క్రికెటర్లు డిమాండ్ చేసినా బోర్డు నోరు మెదపలేదు. కానీ, డంక్ ఫ్లెచర్‌కు మద్దతుగా ధోనీ ఒక్క వ్యాఖ్య చేయడంతో బీసీసీఐ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధోనీని మందలించడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే త్వరలోనే టీమ్ ఇండియా కోచ్‌ ఫ్లెచర్‌పై బీసీసీఐ వేటు వేస్తుందన్న అనుమానం కలుగుతోంది.