శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (11:05 IST)

కోమాలోకి వెళ్లిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి

ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ (25) మృతి చెందాడు. మూడు రోజుల క్రితం తలకు క్రికెట్ బంతి తగిలి తలకు తీవ్ర గాయమై కోమాలోకి వెళ్లిన హ్యూస్ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఆసీస్ ఓపెనర్ అయిన ఫిలిప్ హ్యూస్ మూడు రోజుల క్రితం జరిగిన దేశావాళీ మ్యాచ్‌లో న్యూ సౌత్ వేల్స్ బౌలర్ వేసిన బంతికి తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించి శస్త్రచికిత్స నిర్వహించారు. రెండు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన హ్యూస్ మరణించాడని గురువారం ఆస్ట్రేలియా క్రికెట్ ప్రకటించింది. 
 
ఫిలిప్ హ్యూస్‌ది ఒడుదుడుకుల కెరీరే కావొచ్చుగానీ, అంతర్జాతీయ క్రికెట్‌పై తనదైన ముద్రవేశాడు. అత్యంత పిన్నవయస్సు (19 ఏండ్లు)లో ఒకే టెస్టులో రెండు సెంచరీలు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు హ్యూస్ పేరిటే ఉంది. 2009లో దక్షిణాఫ్రికాపై డర్బన్ టెస్టులో స్టెయిన్, మోర్కెల్‌ల బౌలింగ్‌కు ఎదురొడ్డి ఓపెనర్‌గా 115, 160 స్కోర్లు చేశాడు. 
 
ఇది అతనికి కెరీర్‌లో రెండో టెస్ట్. కెరీర్‌లో తొలి వన్డేలోనే (2013లో శ్రీలంకపై 112) సెంచరీ కొట్టాడు. గతేడాది ఇంగ్లండ్‌పై (నాటింగ్‌హామ్ టెస్ట్) ఏగర్‌తో కలిసి 163 పరుగులు జోడించి, టెస్టు క్రికెట్లోనే పదో వికెట్‌కు రెండో అత్యుత్తమ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. కాగా, ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడాల్సిన హ్యూస్ మరణం క్రికెటర్లతో పాటు ఆయన అభిమానుల్లో విషాదం నింపింది.