శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 18 డిశెంబరు 2014 (14:48 IST)

ధోనీ సరికొత్త రికార్డు: విజయ్ అదుర్స్.. గబ్బాలో రికార్డుల పంట!

టీమిండియా కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో కొత్త రికార్డు వచ్చిపడింది. విదేశాల్లో ఎక్కువ టెస్టులకు కెప్టెన్సీ వహించిన ఘనతను ధోనీ సొంతం చేసుకున్నాడు. సౌరవ్ గంగూలీ విదేశాల్లో భారత్‌కు 28 టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరించగా, ధోనీ 29వ టెస్టులో నాయకత్వం వహించడం ద్వారా అతని రికార్డును అధిగమించాడు.
 
ఇకపోతే.. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో రికార్డుల పంట పడింది. బుధవారం మొదలైన రెండో టెస్టు మ్యాచ్‌లో సెంచరీతో శతక్కొట్టిన భారత ఓపెనర్ మురళీ విజయ్ కూడా ధోనీలా అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు.  గబ్బా స్టేడియంలో ఒక టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన తొలి విదేశీ ఆటగాడిగా విజయ్ రికార్డు నెలకొల్పాడు.
 
అంతకుముందు, 1968-69 సీజన్‌లో వెస్టిండీస్ ఆటగాడు మెక్ కారే అత్యధికంగా 83 పరుగులు చేశాడు. గబ్బా స్టేడియంలో ఒక భారత ఆటగాడు చేసిన అత్యధిక పరుగుల రికార్డును గంగూలీతో కలిసి విజయ్ పంచుకుంటున్నాడు. 2003 డిసెంబర్‌లో గంగూలీ 144 పరుగులు సాధించగా, విజయ్ కూడా అదే స్కోరు చేశాడు. ఈ స్టేడియంలో సునీల్ గవాస్కర్ (113), ఎంఎల్ జైసింహ (1968) కూడా సెంచరీలు సాధించారు.
 
ఈ సిరీస్‌లో కోహ్లీ 275 (సగటు 91.66) పరుగులు చేయగా, విజయ్ 296 (సగటు 98.66) పరుగులతో అతనిని అధిగమించాడు. విజయ్ కెరీర్‌లో ఇప్పటి వరకూ ఐదు సెంచరీలు సాధించగా, అందులో నాలుగు ఆసీస్‌పై చేసినవే. ఆజింక్య రహానే కెరీర్‌లో ఐదవ, ఆస్ట్రేలియాపై రెండో అర్ధ సెంచరీ చేశాడు. అడెలైడ్‌లో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అతను 72 పరుగులు చేయగా, ఇప్పుడు 75 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.
 
గబ్బా స్టేడియంలో ఒక టెస్టు మ్యాచ్ మొదటి రోజునే 300లకు పైగా పరుగులు చేసిన రెండో జట్టుగా భారత్ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. 1960-61 సీజన్‌లో వెస్టిండీస్ ఏడు వికెట్లకు 359 పరుగులు సాధించింది. ఇప్పుడు భారత్ నాలుగు వికెట్లకు 311 పరుగులు చేసింది.