శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 జులై 2014 (13:37 IST)

ఆంధ్ర కెప్టెన్‌గా కైఫ్ : వచ్చే రంజీ సీజన్‌లో రాణిస్తా!

వచ్చే రంజీ సీజన్‌లో ఆంధ్రా క్రికెట్‌ జట్టుకు టీమిండియా క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 16 ఏళ్లుగా ఉత్తర ప్రదేశ్‌ (యూపీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న కైఫ్‌ ఆ జట్టుకు గుడ్‌ బై చెప్పాడు. వచ్చే సీజన్‌ నుంచి ఆంధ్రా జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఈ మేరకు ఆంధ్రా క్రికెట్‌ సంఘంతో (ఏసీఏ) రెండేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. 
 
ఆగస్టు 1న కైఫ్‌ జట్టుతో కలవనున్నాడు. అలహాబాద్‌లో జన్మించిన కైఫ్‌ ఉత్తర ప్రదేశ్‌ తరఫున ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 9277 పరుగులు చేసి 143 క్యాచ్‌లు అందుకున్నాడు. బౌలింగ్‌లోనూ 20 వికెట్లు పడగొట్టాడు. ‘ఉత్తర ప్రదేశ్‌తో నా అనుబంధం ముగిసింది. ఈ రాష్ట్రం నుంచి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాల్సిన అవసరముంది. 
 
సురేష్‌ రైనా, ప్రవీణ్‌ కుమార్‌, పియూష్‌ చావ్లా జట్టులోకొచ్చినపుడు వారు అంతర్జాతీయ క్రికెటర్లుగా ఎదిగేందుకు మార్గదర్శంగా నిలిచాం. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన యువ క్రికెటర్లను ముందుకు తీసుకెళ్లే అవకాశం వచ్చింద’ని కైఫ్‌ చెప్పాడు. బాధ్యతాయుతంగా ఆడటంతో, జట్టును సమర్థవంతంగా నడిపించి రంజీ సీజన్‌లో రాణిస్తానని కైఫ్ తెలిపాడు.