శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (21:35 IST)

రెహానే - ధావన్ జోరు.. ఇంగ్లండ్ చిత్తు : వన్డే సిరీస్ భారత్ వశం!

బర్మింగ్‌హామ్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు టీమిండియా చేతిలో వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలివుండగానే కైవసం చేసుకుంది. భారత ఓపెనర్ రెహాన్, శిఖర్ ధావన్‌లు వీరవిహారం చేయడంతో 9 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. 
 
భారత ఓపెనర్లు రహానే 106, శిఖర్ ధావన్ 97 (నాటౌట్) చెలరేగి ఆడటంతో లక్ష్యాన్ని 30.3 ఓవర్లలోనే భారత్ చేధించింది. సెంచరీ పూర్తి చేసిన అనంతరం రహానే అవుట్ కావడంతో విరాట్ కోహ్లి 1 (నాటౌట్) క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోర్ 212/1 కాగా, ఇంగ్లండ్ స్కోర్ 206 ఆలౌట్. ఐదు వన్డేల సిరీస్ లో 3-0 ఆధిక్యంతో భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది.
 
అంతకుముందు 207 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ ఆది నుంచి దూకుడుగానే ప్రారంభించింది. భారత ఓపెనర్ రహానే 4 సిక్స్, 9 ఫోర్లతో చెలరేగి ఆడటంతో 96 బంతుల్లో సెంచరీ (100)ని పూర్తి చేశాడు. రహానేకు శిఖర్ ధావన్ (68) తోడవ్వడంతో భారత్ 28 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 177 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్ బౌండరీల ధాటికి ఇంగ్లండ్ బౌలర్లు చేతులెత్తేశారు. 
 
అంతకుముందు.. టీమిండియా బౌలర్లు సమష్టిగా కదం తొక్కడంతో ఆతిథ్య ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. 49.3 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటయ్యారు. ఆ జట్టులో మొయిన్ అలీ (67) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రూట్ 44, మోర్గాన్ 32 పరుగులు చేశారు. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు తీయగా... భువనేశ్వర్, జడేజా తలో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బతీశారు.