శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 18 సెప్టెంబరు 2014 (11:15 IST)

పృథ్వీ షా: రికార్డులతో రూ.36లక్షల డీల్ కుదుర్చుకున్నాడోచ్!

గతేడాది హ్యారిస్ షీల్డ్ స్కూల్స్ క్రికెట్ టోర్నీలో 546 పరుగులు సాధించి అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు నమోదు చేసిన పృథ్వీ షా ఇప్పుడు గ్రాండ్ డీల్ సొంతం చేసుకున్నాడు. ఇకమీదట విఖ్యాత క్రికెట్ ఉపకరణాల తయారీదారు ఎస్జీ ఈ ముంబయి పిడుగుకు ఆరేళ్ళపాటు స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈ మేరకు రూ.36 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. 
 
దీనిపై ఎస్జీ సంస్థ మార్కెటింగ్ డైరక్టర్ పరాస్ ఆనంద్ మాట్లాడుతూ, "పృథ్వీ మా సంస్థ ఉత్పత్తులను గత మూణ్ణాలుగేళ్ళుగా ఉపయోగిస్తున్నాడు. గతేడాది వరల్డ్ రికార్డు బ్రేక్ చేయడంతో వెలుగులోకి వచ్చాడు. ఇకమీదట అతనికి అవసరమైన సహాయాన్ని అందిస్తాం. మా వరల్డ్ క్లాస్ ఉత్పత్తులను అందించడమే కాకుండా, ప్రయాణ, శిక్షణ ఖర్చులను కూడా మేమే భరిస్తాం" అని తెలిపారు. 
 
కాగా, పృథ్వీ షా గతేడాది తన అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో ఓ ఇన్నింగ్స్‌లో ఐదు వందలకు పైగా పరుగులతో అందరినీ అబ్బురపరిచాడు. ఈ క్రమంలో 2010-11 సీజన్‌లో ముంబయికే చెందిన అర్మాన్ జాఫర్ నమోదు చేసిన 498 పరుగుల వరల్డ్ రికార్డును అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించాడు.