శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2014 (15:33 IST)

ధోనీ కెప్టెన్సీలో లోపమున్నట్లు భావించట్లేదు: రవిశాస్త్రి

ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్‌లో దారుణ వైఫల్యం తర్వాత టీమిండియా మరో కఠిన సవాల్‌కు సిద్ధమైంది. వన్డే సిరీస్‌ సన్నాహకాల్లో భాగంగా భారత్‌ శుక్రవారం మిడిలెసెక్స్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి ఐదు వన్డేల సిరీస్‌కు ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలని మహేంద్ర సింగ్ ధోనీ సేన కృతనిశ్చయంతో ఉంది. 
 
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సత్తాచాటాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఇక వామప్‌ మ్యాచ్‌లో కెప్టెన్‌ ధోనీ ఆడే అవకాశాలు కన్పించడం లేదు. వివిధ విన్నింగ్‌ కాంబినేషన్లు పరీక్షించాలని ధోనీ భావిస్తున్నాడు. దీంతో యువ కీపర్‌ శాంసన్‌కు అవకాశం దక్కనుంది. కాగా గురువారం కూడా టీమిండియా నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చింది. 
 
సహాయ కోచ్‌లు పెన్నీ, డేవ్స్‌ పర్యవేక్షణలోనే భారత్‌ నెట్‌ ప్రాక్టీస్‌ చేసింది. కొత్త సిబ్బంది ఇంకా జట్టుతో చేరలేదు. కాగా, కెప్టెన్‌గా ధోనీనే కొనసాగాలని టీమిండియా డైరెక్టర్‌గా నూతనంగా నియమితులైన మాజీ క్రికెటర్ రవిశాస్త్రి అన్నాడు. 
 
ధోనీకి ఇదోక కఠినమైన సమయమని తెలిపాడు. అయితే తాను ధోనీ కెప్టెన్సీలో లోపం ఉన్నట్లుగా భావించడం లేదని చెప్పాడు. ధోనీ టీం సభ్యులను ముందుండి నడిపించాలని భావిస్తున్నప్పటికీ.. ఇతర ఆటగాళ్లు గాడిన పడటం లేదని రవి శాస్త్రి అన్నాడు.