శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 28 ఆగస్టు 2014 (12:37 IST)

కార్డిఫ్ వన్డే : సురేష్ రైనా శతకం - ఇంగ్లండ్‌పై భారత్ గెలుపు!

కార్డిఫ్ వేదికగా బుధవారం జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత్ విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో సురేష్ రైనా శతకంతో రెచ్చిపోయాడు. 75 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో వంద పరుగులు చేయగా, ధోనీ కూడా అర్థ సెంచరీతో రాణించడం, బౌలర్లు రాణించడంతో భారత్ ఎట్టకేలకు ఇంగ్లండ్ గడ్డపై విజయం నమోదు చేసుకుంది. 
 
రెండో మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం.. భారత్‌ 133 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై జయభేరి మోగించింది. సురేశ్‌ రైనా (75 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 100) శతకానికి తోడు రోహిత్‌ శర్మ (52), కెప్టెన్‌ ధోనీ (52) అర్థ సెంచరీలతో రాణించడంతో.. భారత్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. కోహ్లీ ఎప్పటిలా డకౌట్ అయ్యాడు. 
 
క్రిస్‌ వోక్స్‌ 4 వికెట్లు పడగొట్టగా.. ట్రెడ్‌వెల్‌ 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత 295 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 38.1 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రైనా మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే నాటింగ్‌హామ్‌లో శనివారం జరగనుంది. 
 
భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ ఆరంభంలోనే తడబడింది. షమి దెబ్బకు కుక్‌సేన 63 పరుగులకే 3 ప్రధాన వికెట్లు కోల్పోయింది. 11వ ఓవర్‌లో కుక్‌ (19), బెల్‌ (1)ను షమి అవుట్‌ చేశాడు. రూట్‌ (4) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేక పోయాడు. ప్రమాదకరంగా మారుతున్న అరంగేట్రం ఆట గాడు హేల్స్‌ (40)ను జడేజా బలి తీసుకున్నాడు. దీంతో ఇంగ్లండ్‌ 85 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక బట్లర్‌ (2), స్టోక్స్‌ (23), వోక్స్‌ (20)నూ అవుట్‌ చేసిన జడేజా.. ఇంగ్లండ్‌ ను కోలుకోలేని దెబ్బతీశాడు. భారత బౌలర్లలో జడేజా నాలుగు, అశ్విన్ రెండు, షమీ రెండు వికెట్లు తీశారు.