శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 20 సెప్టెంబరు 2014 (11:22 IST)

విలియమ్సన్ అదుర్స్ సెంచరీ: సీఎల్‌టీ-20లో కోబ్రాస్ ఓటమి!

కేన్‌ విలియమ్సన్‌ (49 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 నాటౌట్‌) శతకంతో విజృంభించడంతో నార్తర్న్‌ నైట్స్‌ సీఎల్‌ టీ-20లో శుభారంభం చేసింది. ఈ టోర్నీలో ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. 
 
కాగా చాంపియన్స్‌ లీగ్‌ చరిత్రలో ఏడోది. కేన్‌ ప్రదర్శనతో గ్రూప్‌-బిలో నార్తర్న్‌ జట్టు 33 పరుగుల (డక్‌వర్త్‌ లూయిస్‌) తేడాతో కేప్‌ కోబ్రాస్‌పై విజయం సాధించింది. శుక్రవారమిక్కడ జరిగిన మ్యాచ్‌లో తొలుత.. నార్తర్న్‌ నైట్స్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. 
 
విలియమ్సన్‌తో పాటు డెవ్‌సిచ్‌ (46 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 67) అర్ధ సెంచరీతో రాణించాడు. అనంతరం భారీ ఛేదనలో కేప్‌ కోబ్రాస్‌ 7.2 ఓవర్లలో 44/2 స్కోరు వద్ద ఉండగా వర్షంతో ఆట నిలిచిపోయింది. తర్వాత వర్షం తగ్గినా అవుట్‌ ఫీల్డ్‌ మొత్తం చిత్తడిగా మారింది. దీంతో మ్యాచ్‌ కొనసాగించే వీలులేక పోయింది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం కేప్‌ కోబ్రాస్‌ 7.2 ఓవర్లలో 77 పరుగులు చేయాల్సి ఉండగా.. అప్పటికీ 44 రన్స్‌ మాత్రమే చేయడంతో ఓడిపోయింది. 
 
అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నార్తర్న్‌ నైట్స్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. విలియమ్సన్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే బౌండ్రీతో హిట్టింగ్‌ మొదలు పెట్టాడు. మరో ఎండ్‌లో డెవిసిచ్‌ కూడా బ్యాట్‌కు పని చెప్పాడు. విలియమ్సన్‌-డెవ్‌సిచ్‌ తొలి వికెట్‌కు 140 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత ఫ్లిన్‌ (0) నిరాశపర్చినా.. చివరి ఐదు ఓవర్లలో వాట్లింగ్‌-కేన్‌ భారీ షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. 
 
అయితే నార్తర్న్‌ జట్టు రెండు పరుగుల తేడాతో.. వాట్లింగ్‌ (32), స్టయిరిస్‌ (0), మిచెల్‌ (0) వికెట్లను కోల్పోయింది. ఇక ఆఖరి ఓవర్‌లో విలియమ్సన్‌ సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేశాడు.