శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: సోమవారం, 16 జనవరి 2017 (14:35 IST)

లక్ష్య ఛేదన ఒకవైపు... సెంచరీల మోత మరోవైపు... సచిన్ సరసన కోహ్లి

టీమిండియా ఇప్పుడు ఒకే మంత్రం పఠిస్తోంది. దాని పేరు కోహ్లీ.. దాని లక్ష్యం దూకుడు, నిర్భయంగా కొండను ఢీకొనడం. దాని ద్వారా వచ్చే విజయం ఎంత గొప్పదో ఆదివారం అందరికంటే ఎక్కువగా అర్థమైంది కేదార్‌కే అంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు... ఒన్డే విజయం సాధనలో సెంచరీ

టీమిండియా ఇప్పుడు ఒకే మంత్రం పఠిస్తోంది. దాని పేరు కోహ్లీ.. దాని లక్ష్యం దూకుడు, నిర్భయంగా కొండను ఢీకొనడం. దాని ద్వారా వచ్చే విజయం ఎంత గొప్పదో ఆదివారం అందరికంటే ఎక్కువగా అర్థమైంది కేదార్‌కే అంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు... ఒన్డే విజయం సాధనలో సెంచరీ కొట్టడంతోపాటు లక్ష్య ఛేదన చాలా కీలకం. అలాంటి రికార్డును కోహ్లి ఆదివారం నాడు నెలకొల్పాడు.
 
భారత వన్డే టీమ్ సభ్యులు, టీమ్ కోచ్ అనిల్ కుంబ్లే, సహాయక సిబ్బంది ముఖాల్లో నెత్తురు చుక్కలేకుండా పోయిన క్షణాలవి. ఒక వైపు బెదరగొడుతున్న భారీ పరుగుల లక్ష్యం. మరోవైపు టపటపా రాలుతున్న వికెట్లు, మహామహులుగా భావించిన వారు వొట్టి చేతులతో వెనక్కు రావడం. కళ్లముందు ఏం జరుగుతోందో అర్థం కాని విచిత్ర పరిస్థితి. 12 ఓవర్లలో 63 పరుగులకు నాలుగు వికెట్లు ఢమాల్ అన్న సందర్భం. ఎవరైనా సరే ఆశలు వదిలేసుకోవాల్సిన క్షణం. కోహ్లీ ఒక్కడే మిగిలి ఉన్నాడు. ఎలాగోలా ఒడ్డెక్కించగలడనే నమ్మకం ఉన్న అవతలివైపు బ్యాటింగ్ చేస్తూ సహాయక పాత్రలో అయినా నిలబడేవారెవరు అనే సందేహాలు అలుముకుంటున్న సందర్భంలో..
 
ఉదయిస్తున్న సూర్యుడిలా కేదార్ లేచాడు. క్షణాలు నిమిషాలుగా మారుతున్న క్రమంలో ఒక దిగ్భ్రాంతికరమైన ఇన్నింగ్స్‌ను అతడు నిర్మించాడు. కోహ్లీ సహాయకుడిగా కాదు తొలిసారి కోహ్లీనే రన్ రేట్ విషయంలో అధిగమించిన మేటి బ్యాట్స్‌మన్‌గా కేదార్ జాదవ్ అవతరించాడు. పుణే సొంత మైదానం. తల్లిదండ్రులు, భార్య, బిడ్డ అందరూ ఊపిరి బిగపట్టుకుని చూస్తున్నారు. ఒక్కరాత్రిలో ఒక ఆటగాడు దేశానికే ఆశాకిరణం కావడం అరుదుగా జరుగుతుంటుంది. ఆ ఆరుదైన క్షణాలు కేదార్ బ్యాట్ నుంచి అలా జాలువారుతూ సాగాయి. ఏ పరుగునూ అతడు వదలలేదు. డాట్ బాల్స్‌కి అసలు అవకాశం ఇవ్వలేదు. ఇంగ్లండ్ బౌలర్లు పరుగులు ఇవ్వకుండా నిరోధించిన ప్రతి సారీ అతడు బంతిని మైదానం దాటించాడు. నమ్మశక్యం కాని ఆ ఛేజ్‌లో కోహ్లీనే మించిపోయిన ఘనత సాధించాడు. 
 
ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోని కోహ్లీ అతడికే ఎక్కువ స్ట్రయికింగ్ ఇచ్చాడు. ఆట వన్ మ్యాన్ షో కాదన్న సత్యాన్ని ఆకళింపు చేసుకున్నాడు కాబట్టే కోహ్లీ తన కళ్లముందు కేదార్ విజృంభణను స్వాగతించాడు. చూస్తుండగానే అటు కోహ్లీ, కేదార్ సెంచరీలతో కదం తొక్కారు. తర్వాత వెంటనే ఇద్దరూ అవుటయినప్పటికీ అప్పటికే ఇంగ్లండ్‌కి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వారు మిగిల్చిన కార్యక్రమాన్ని హార్దిక్ పాండ్యా, అశ్విన్ ఒత్తిడిని అధిగమించి  పూర్తి చేశారు.
 
భారత క్రికెట్ టీమ్‌లో ఆనందహేల, గెలిచిన క్షణంలో కేదార్‌ను దగ్గరకు తీసుకని కోచ్ కుంబ్లే మాట్లాడటం చూస్తున్నవారికి మనోహర దృశ్యమే అయింది. 63 పరుగుల వద్ద 4 వికెట్ల స్కోరును 150 పరుగులకు తీసుకుపోయేవరకు ఆడు అన్న కెప్టెన్ మాటను తూచా తప్పకుండా ఆడాడు కేదార్. 150 కాదు 260 పరుగుల వరకు ఆగని పరుగుల వరదను సృష్టించాడు. కేదార్ సొంత మాటల్లోనే చెప్పాలంటే..
 
దేశానికి విజయం సాధించిపెట్టిన గేమ్‌ని ఆడినందుకు గొప్పగా అనుభూతి చెందుతున్నాను. అది కూడా నా సొంత మైదానంలో, నా తల్లిదండ్రులు, భార్య, కుమార్తె సమక్షంలో ఆడడం మరీ సంతోషం. పెద్దపెద్ద లక్ష్యాలను ఎలా ఛేదించాలో కేప్టెన్ కోహ్లీ మాకు చూపించాడు.  బ్యాటింగ్‌లో ఇప్పటికే అనేక అవకాశాలు పోగొట్టుకున్నాను. విరాట్‌తో కలిసి ఆడుతూ అతడి బ్యాటింగ్‌ను చూసే అవకాశాలు గతంలో పొగొట్టుకున్నాను. కోహ్లీతో పరుగులు తీయడం చాలా కష్టం. కాని ఈరోజు నేను సాధించాను.