శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : ఆదివారం, 23 జూన్ 2019 (16:43 IST)

మైదానంలో విరాట్ కోహ్లీ దూకుడు.. ఐసీసీ ముకుతాడు

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తేరుకోలేని షాకిచ్చింది. ఫీల్డ్ అంపైర్‌తో వాదనకు దిగడం, లెక్కకు మించి అప్పీళ్లు చేయడం వంటి విషయాలపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా, శనివారం సౌతాంఫ్టన్ వేదికగా భారత్ - ఆప్ఘాన్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన చెమటోడ్చి 11 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆపసోపాలు పడి గెలిచినప్పటికీ ప్రశంసలు మాత్రం క్రికెట్ పసికూన ఆప్ఘాన్ జట్టుకే దక్కుతున్నాయి. 
 
అయితే, ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రవర్తన మాత్రం చాలా దూకుడుగా ఉంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ లెక్కకు మించినన్నిసార్లు అప్పీలు చేశాడని ఐసీసీ అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫైన్ విధించింది.
 
మ్యాచ్‌లో భాగంగా షమీ వేసిన 29 ఓవర్లో ఓ బంతి ఆఫ్గాన్ ఆటగాడు హజ్రతుల్లా ప్యాడ్స్‌కు తాకింది. దాంతో కోహ్లీ ఎల్బీడబ్ల్యూకి అప్పీలు చేశాడు. అప్పుడు ఫీల్డ్ అంపైర్ అలీమ్ దార్ నాటౌట్‌గా ప్రకటించాడు. వెంటనే కోహ్లీ, వికెట్ కీపర్ ధోనీ, బౌలర్ షమీతో చర్చించి డీఆర్ఎస్ రివ్యూకు వెళ్లాడు. 
 
షమీ వేసిన ఆ బంతి అవుట్ సైడ్ పిచ్‌లో పడటంతో థర్డ్ అంపైర్ కూడా నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో కోహ్లీ ఫీల్డ్ అంపైర్ అలీమ్ దార్‌తో వాదనకు దిగాడు. ఆర్టికల్ 2.1 ప్రకారం అలా వాదనకు దిగడం, ఎక్కువసార్లు అప్పీలుకు వెళ్లడం ఐసీసీ నిబంధనలకు విరుద్ధమని బోర్డు తెలిపింది.
 
కోహ్లీ అంపైర్‌తో వాదనకు దిగడం వల్ల అతని కెరీర్‌లో రెండో డీమెరిట్ పాయింట్ చేరింది. ఇలా డీమెరిట్ పాయింట్ పడటం కోహ్లీకి ఇదే మొదటిసారి కాదు. ఎందుకంటే.. 2018, జనవరి 15న ప్రిటోరియాలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కూడా ఈ విధంగానే కోహ్లీకి డీమెరిట్ పాయింట్ పడింది.