ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 6 ఆగస్టు 2022 (20:59 IST)

Domestic violence: ఈ బాధ భరించలేను డాడీ... చనిపోతున్నాను నన్ను క్షమించు: ఎన్నారై మహిళ

Woman
మహిళలపై హింస ఎంతమాత్రం ఆగటంలేదు. ఈ హింస రకరకాలుగా వుంటోంది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డలు పడుతున్న కష్టాలు చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా బాధపడే ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే అమెరికా న్యూయార్క్ నగరంలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.

 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోరుకు చెందిన మన్ దీప్ కౌర్‌కి రంజోద్ బీర్ సింగుకి 2015లో పెళ్లయింది. ఆ తర్వాత అతడు అమెరికాలోని న్యూయార్క్ నగరానికి వలస వెళ్లాడు. అక్కడ వీరికి ఇద్దరు కుమార్తెలు కలిగారు. ఐతే మగబిడ్డ పుట్టలేదంటూ కౌర్ ను వేధించడం మొదలుపెట్టాడు. తనను శారీరకంగా భర్త హింసిస్తున్నాడనీ, అత్తింటివారు సూటిపోటి మాటలతో వేధిస్తున్నారని ఆమె తను సెల్ఫీ వీడియోలో కన్నీటిపర్యంతమైంది.

 
ఎనిమిదేళ్లుగా ఈ బాధలు భరిస్తున్నాననీ, ఇక భరించడం తన వల్ల కాదని కన్నీటితో చెప్పింది. తనను ఆత్మహత్య చేసుకుని చనిపొమ్మని అత్తింటివారు వేధిస్తున్నారని చెప్పింది. ఇంకా వీటిని భరిస్తూ నేను బ్రతకలేను డాడీ... చనిపోతున్నాను డాడీ నన్ను క్షమించు అంటూ ఆమె పోస్ట్ చేసిన వీడియో హృదయాలను ద్రవింపజేస్తోంది. ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన కుమార్తె మృతదేహాన్ని రప్పించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. కాగా ఆమె మృతికి కారకులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది వెల్లడికాలేదు.