శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Eswar
Last Modified: బుధవారం, 23 జులై 2014 (14:34 IST)

ఆంధ్రప్రదేశ్ రాజధానికి అర్హమైన నగరం అదే...!

రాజధాని... రాష్ట్ర ఆర్థిక, రాజకీయ, వాణిజ్య, అభివృద్ధి కార్యకలాపాలకు గుండెకాయ. అది దేశానికైనా, రాష్ట్రానికైనా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ఆ కీలక స్థానం ఏర్పాటు అనేక మలుపులు తిరుగుతోంది. రాజకీయ ఎత్తుగడలు, బడాబాబుల ప్రవేశాలు, ఊహాగానాలు, పుకార్లు, వీటన్నిటి మధ్య సామాన్య ప్రజానీకాన్ని అంతులేని గందరగోళంలో పడేస్తున్నారు. 
 
శివరామ కృష్ణన్ కమిటీ.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఏ ప్రాంతం అనువుగా ఉంటుందో సిఫారసు చేయటానికి కేంద్రం దీనిని ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మాజీ సెక్రటరీ శివరామకృష్ణన్ నేతృత్వం వహిస్తున్నారు. ఆయనతో పాటు మరో నలుగురు వివిధ రంగాల నిపుణులను సభ్యులుగా ఉంచారు. ఈ కమిటీ దాదాపు రెండు నెలలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు తిరిగి నివేదికను తయారుచేసింది.
 
ఇప్పటికే కేంద్రం నియమించిన సభ్యుల పని పూర్తయింది. ఈ దశలో చంద్రబాబు కొత్త ముఖాలను తెరపైకి తెచ్చారు. తీరా చూస్తే, అంతా బడాబాబులే.. వీళ్లఛాయిస్‌లో ఎలాంటి రాజధాని రాబోతోంది? దాని వెనుక ఎలాంటి మతలబులు ఉండబోతున్నాయి? ఎవరి లాభాల కోసం రాజధాని కమిటీ పనిచేస్తుంది? ప్రజా శ్రేయస్సా? లేక, కార్పొరేట్ ప్రయోజనాలా?  పారిశ్రామికవేత్తలే రాజధానిని, ఆ నగరం ఎలా ఉండాలి అనే విషయాన్ని నిర్ణయిస్తారా? వాళ్లే డిజైన్ చేస్తారా? రాజధాని కమిటీలో పౌరసమాజానికి స్థానమేది? ఆంధ్రప్రదేశ్ కు పక్కా కార్పొరేట్ క్యాపిటల్ రాబోతోందా?
 
ఇంకో కమిటీ అవసరం ఏమొచ్చింది? 
ఈ కొత్త కమిటీలో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధ్యక్షతన 9 మంది సభ్యుల  కమిటీకి కన్వీనర్‌గా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఉంటారు. ఇక కమిటీలో సభ్యులుగా  సుజనా చౌదరి, గల్లా జయదేవ్, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ రావు, సంజయ్ రెడ్డి, బొమ్మిడాల శ్రీనివాస్, ఎం. ప్రభాకర్ రావు, శ్రీనివాసరాజు సభ్యులుగా ఉంటారు. మునిసిపల్ మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శిని మినహాయిస్తే,  మిగతా సభ్యుల్లో పారిశ్రామికవేత్తలు ఆరుగురున్నారు. వారు ఎంపీ సుజనా చౌదరి, సుజనా గ్రూపు అధినేత. గల్లా జయదేవ్, అమరరాజా గ్రూపు కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్. జీవీ సంజీవరెడ్డి, జీవీకె గ్రూపు కంపెనీల వైస్ చైర్మన్. బొమ్మిడాల శ్రీనివాసరావు,  జీఎమ్మార్ గ్రూపు కంపెనీల్లో కీలక వ్యక్తి. ఇక మండవ ప్రభాకరరావు నూజివీడు సీడ్స్ చైర్మన్. చింతలపాటి శ్రీనివాస రాజు పీపల్ క్యాపిటల్ చైర్మన్.  
 
ఎవరి ప్రాధాన్యతలు పరిగణనలోకి తీసుకోవాలి? 
రాజధాని నగరం కోట్లాది ప్రజలకు సంబంధించిన ప్రాంతం. ఆ నగరంతో ఆ రాష్ట్ర ప్రజల ఆర్థిక, విద్యా, వైద్యా, సాధారణ, పరిపాలన అంశాలు ముడిపడి ఉంటాయి. కావాల్సినంత భూమి, సౌకర్యాల కల్పనకు అవకాశం, విస్తరణకు సాధ్యమయ్యే గుణం తప్పనిసరి. అన్నిటికంటే ఆ నగరం ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. వాస్తవానికి కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీలో రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు కాకుండా, ఆయా విభాగాల్లో నిపుణులకు, మేధావులకు స్థానం కల్పించారు. కానీ, ఇక్కడ మేధావులను, పౌర సమాజాన్ని విస్మరించారు. మిగతా రాజకీయ పక్షాలను కూడా  వదిలేశారు. కేవలం చంద్రబాబు సన్నిహితులను అదీ పారిశ్రామిక వేత్తలకు మాత్రమే ఈ కమిటీలో చోటు కల్పించటం ఎన్నో విమర్శలకు దారితీస్తోంది. 
 
ఈ కమిటీ ఏం చేయబోతోంది? 
కొత్త రాజ‌ధాని రూపురేఖ‌లు ఎలా ఉండాలి? మౌలిక వసతుల కల్పన, రవాణా, నిర్వహణ తదితర అంశాల్లో కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చే నిధులు కాక… అదనంగా సమీకరించేందుకు కూడా ఈ రాజధాని కమిటీ సూచనలు చేస్తుంది.
 
చంద్రబాబు కమిటీపై ఆరోపణల వెల్లువ 
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని నిర్మాణానికి సలహాలు కోరడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించిన కమిటీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని కమిటీలో బడా పారిశ్రామికవేత్తలకే పెద్దపీట వేయటం పలు అనుమానాలకు తావిస్తోంది. పైగా టీడీపీకి చెందిన, బాబు అనుకూల పారిశ్రామికవేత్తలే ఉండటాన్ని కూడా విపక్షాలు తప్పు పడుతున్నాయి. 
 
దీనివెనుక ఉన్న రాజకీయం ఏంటి?  
పారిశ్రామికవేత్తల ప్రాధాన్యాలెలా ఉంటాయో తెలియని విషయం కాదు. వ్యాపారాలకు, పెట్టుబడులకు అనువుగా ఉండే ఆలోచనలు చేయటం విధానాలకు వంతపాడటం చాలా మామూలు విషయం. విషయ నిపుణులను, ప్రజాబాహుళ్యంలో ఉన్న మేధావులను, వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులను వదిలేసి కేవలం చంద్రబాబు సన్నిహితులను, కోట్లకు పడగలెత్తిన పెద్దల్ని రాజధాని ఎక్కడ పెట్టాలో సూచించండి అని అడగటంలో ఆంతర్యం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 
 
అధికారపార్టీ ఈ అంశాన్ని కూడా తమ బిజినెస్‌ బ్యాచ్‌కి అనుకూలంగా వాడుకుంటుందనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఎక్కడెక్కడో ఏవి వస్తాయో నిర్ణయించుకుని అక్కడ భూములు కొనిపెట్టుకుని తీరిగ్గా ఆగస్టులో ప్రకటనలు చేయాలని చూస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రాజధాని సలహా సంఘం పేరుతో వేసిన ఈ కమిటీ.. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కేపిటల్‌ బిజినెస్‌ గురించి చెప్పకనే చెప్పిందనే విమర్శలు వినపడుతున్నాయి.
 
కొత్త రాజధాని ఎంపికపై ఉత్కంఠ 
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. విజయవాడ - గుంటూరు జిల్లాల మధ్య కొత్త రాజధాని వస్తోందన్న ప్రచారం ఇప్పటికే  ఊపందుకుంది. మరోవైపు బహుముఖంగా అభివృద్ధి చెందిన విశాఖ నగరాన్ని రాజధానిగా ఎంపిక చేయాలని ఉత్తరాంధ్ర వారు కోరుతుంటే, ఇటు రాయలసీమవాసులు గతంలో కర్నూలును త్యాగం చేసినందుకు అక్కడే రాజధాని కావాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి అయితే బెటర్ అని మరి కొందరు వాదిస్తున్నారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కూడా విజయవాడలోనే జరగడంతో రాజధాని అక్కడే ఖాయమని అందరూ అనుకున్నారు. కృష్ణా - గుంటూరు జిల్లాల మధ్య రోడ్డు, రైలు మార్గాలు అందుబాటులో ఉండడంతో పాటు నీటి సమస్య లేకపోవడం, మచిలీపట్నం పోర్టు దగ్గరలో ఉండడం వంటి అనుకూలమైన పరిస్థితులు ఉండడంతో ఇక్కడే రాజధాని ఏర్పాటు చేయాలని ఎపి ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదించిందని సమాచారం. అంతేకాదు... రాజధాని మినహా మిగతా 12 జిల్లాల్లో స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయాలని, విజయవాడ-గుంటూరు-తెనాలి పరిధిలో మొత్తం 184 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం.
 
విజయవాడకు రాజధాని అర్హత వుంది : ప్రభుత్వం  
ఇక కొత్త రాజధానిలో ముఖ్యమైనవి అసెంబ్లీ భవనం, సెక్రటేరియట్, హైకోర్టు, డిజిపి ఆఫీసు, పరిపాలన సదుపాయాలు, సభలు సమావేశాల కోసం 5, 6 పెద్ద కన్వెన్షన్లు, బహిరంగ సభలు నిర్వహించేందుకు 4, 5 పెద్ద మైదానాలు, ప్రభుత్వ ఉద్యోగులకు క్వార్టర్లు వంటి సదుపాయాలు ఉండాలని అంచనా. ఇవే కాకుండా అంతర్గత రవాణా వ్యవస్థ, జిల్లాలనుంచి రాకపోకలకు రవాణామార్గాలు, విమానాశ్రయం, నీటి వసతులు, వ్యవసాయం వసతులు అదనంగా ఉండాలి. ఈ అర్హతలన్నీ విజయవాడకు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇపుడు తాజాగా అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉండేలా రాజధాని ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ ఢిల్లీలో శివరామకృష్షన్‌ కమిటికి విజ్ఞప్తి చేయటం ఇందుకు బలం చేకూరుస్తోంది.  
 
అయినా అనుమానాస్పదం 
ఇంతకుముందే చెప్పుకున్నట్టు రాజధాని నగరం ప్రజలకు అనువుగా, భద్రత కల్పించేదిగా అభివృద్ధి పరవళ్లు తొక్కేదిగా ఉండాలి. కానీ జరుగుతున్న పరిణామాలు ఒకింత అనుమానాస్పదమనే అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. ప్రభుత్వానికి కమిటీలు వేసే స్వేచ్ఛ కచ్చితంగా ఉంటుంది. కానీ రాజధాని లాంటి ముఖ్యమైన అంశంలో.. అదెలా ఉండాలో డిజైన్ చేయటంలో పెట్టుబడిదారులే కీలకమైతే సామాన్యుడి ఆలోచనలకు ఏమాత్రం స్థానం ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి.