శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2015 (19:18 IST)

ప్రత్యేక హోదాపై తెగని పంచాయతీ.. ఏపీలో బీజేపీ అడ్రస్ గల్లంతేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అడ్రస్ కూడా గల్లంతు కానుందా? విభజన సమయంలో ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ నేతలు చెప్పిన మాటలనే సీమాంధ్ర ప్రజలు బలంగా నమ్మారు. విశ్వసించారు కూడా. తాము అధికారంలోకి వస్తే ఐదేళ్లు కాదు.. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటూ నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదాపై ఎడతెగని పంచాయితీ చేస్తూ.. మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫలితంగా కమలనాథుల విశ్వసనీయతనే శంకించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
నిజానికి విభజనకు అన్ని పార్టీలు సమ్మతించినా.. ప్రజలు శిక్షించింది మాత్రం ఒక్క కాంగ్రెస్ పార్టీనే. ఎందుకంటే.. అడ్డగోలుగా విభజన చేయడమే కాకుండా, ఏపీ ప్రజలను నిలువునా ముంచేసిందన్న అక్కసు ఏపీ ప్రజల్లో ఉంది. అందుకే ఆ పార్టీకి ఏపీలో సీమాంధ్ర ప్రజలు సమాధికట్టారు. అదేసమయంలో విభజన సమయంలో బీజేపీ సీనియర్ నేతలు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీలు పలికిన మాటలపై ఉన్న విశ్వసనీయతతో టీడీపీ - బీజేపీ కూటమిని గెలిపించారు. 
 
దీంతో ఏపీకి ప్రత్యేక హోదా ఖాయమని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, ఆ పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టి యేడాది పూర్తయినా ప్రత్యేక హోదాపై రోజుకో ప్రకటన చేస్తూ.. ప్రజలను అలజడికి గురిచేస్తోంది. ఇది రాష్ట్రంలోని బీజేపీ నాయకులకు తలనొప్పిగా మారింది. అన్ని రకాలుగా ఏపీని ఆదుకుంటాం, ప్రత్యేక హోదా ఇస్తాం అని పదేపదే చెప్పుకొచ్చిన కేంద్ర పెద్దలు... ఇప్పుడు చేతులెత్తేస్తున్నారా అన్న అనుమానాలు వారిలోనే మొదలయ్యాయి. దీంతో ఏపీ కాషాయ నేతలకు ఏం మాట్లాడాలో అర్థంకాక మీడియాకు ముఖం చాటేస్తున్నారు. 
 
ప్రత్యేక హోదాను రాబట్టుకుని రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని వారు ఎన్నో కలలుగన్నారు. కానీ, హోదా ఉండదన్న సంకేతాలిస్తుండటం ఏపీ బీజేపీ నేతల్ని కలవరపరుస్తోంది. ప్రత్యేక హోదాపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని మిత్రపక్షమైన టీడీపీ నేతలే బాహాటంగా తప్పుబడుతున్నారు. ఘాటుగా స్పందించకపోయినా చాలామంది లోలోపల రగిలిపోతున్నారన్నది కఠోర వాస్తవం. హోదా కోసం పోరాడతామని హామీ ఇచ్చిన కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్‌, అరుణ్ జైట్లీలు ఇపుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. టీడీపీ సంగతేమో కానీ... హోదా విషయంలో కేంద్రం వైఖరి... రాష్ట్రంలో తమ కొంపముంచుతోందని ఏపీ బీజేపీ నేతల్లో చర్చ జరుగుతోంది.