శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 మార్చి 2017 (17:50 IST)

జగన్ కార్యక్రమాల్లో రోజాకు రికార్డింగ్ డ్యాన్సులే... అయ్యా, ఏంటయ్యా ఈ కామెంట్లు?

ప్రజల చేత ఎన్నుకోబడి.. ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు నిర్వర్తించాల్సిన వారే నోరు జారుతున్నారు. అసెంబ్లీ.. మీడియా పాయింట్ ఎక్కడపడితే అక్కడ దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా విమర్శలు చ

ప్రజల చేత ఎన్నుకోబడి.. ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు నిర్వర్తించాల్సిన వారే నోరు జారుతున్నారు. అసెంబ్లీ.. మీడియా పాయింట్ ఎక్కడపడితే అక్కడ దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా విమర్శలు చేయడం.. ప్రజాసమస్యలను పక్కనబెట్టేసి.. దూషించుకుని అసెంబ్లీలో కాలాయాపన చేయడం ప్రస్తుతం ప్రజాప్రతినిధుల ఫ్యాషనైపోయింది. అసెంబ్లీ మొదలైందంటే చాలు.. ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలపై పరిష్కారం దిశగా అధికార పక్షానికి సహకరించి.. ఆ పని పూర్తిచేయకపోతే నిలదీసే సత్తా కరువైంది. 
 
విపక్షం అధికారపక్షాన్ని ప్రజా సమస్యలపై నిక్కచ్చిగా నిలదీయలేకపోతుందని ప్రజలు అనుకుంటున్నారు. సామాన్య ప్రజలకున్న తెలివితేటలు విపక్షాలకు లేవంటున్నారు. పక్కా గణాంకాలతో అధికారపక్షాన్ని కౌంటరటాక్ చేసే నేతలు కరువయ్యారు. అదేవిధంగా అధికార పక్షంలోని నేతలు సైతం వ్యక్తిగత విమర్శలకు చోటివ్వడం.. మేకప్‌ల గురించి మాట్లాడటం.. కేసుల గురించి మాట్లాడటం చేస్తూ.. ప్రజా సమస్యలపై పరిష్కరించకుండా పక్కదారి పడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రజాప్రతినిధులంటే హుందాగా ఉండాలని ప్రజలు ఆశిస్తున్నారు. వ్యక్తిగత, రాజకీయ ఆపేక్షలను పక్కనబెట్టి ప్రజలచే ఎన్నికైన విషయాన్ని గుర్తుపెట్టుకుని నడుచుకోవాలనుకుంటున్నారు. లేదంటే సోషల్ మీడియా ద్వారా ఎంతటి ఉన్నత అధికారులకైనా విమర్శలు తప్పవని రాజకీయ పండితులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు తెలివిగా వ్యవహరిస్తున్నారని.. అది తెలుసుకుని ప్రజాప్రతినిధులు ప్రవర్తించాలని సూచిస్తున్నారు. 
 
ఇటీవల గౌరవప్రదంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు సహనం కోల్పోతున్నారు. నోరు జారుతున్నారు. ఇష్టమొచ్చినట్లు బూతులు తిట్టుకుంటున్నారు. ఒకటా, రెండా తెలుగురాష్ట్రాల్లో ఇటీవల నేతల తిట్ల దండకాలు బాగానే పెరిగిపోయాయి. 'ఏరా, ఏమనుకుంటున్నావ్. నా ఇంటికే కరెంట్ కట్ చేస్తావా? నా ఇంటికి కరెంట్ కట్ చేసే దమ్ముందారా నీకు. తిమ్మిరి ఎక్కవయిందిరా నీకు' అంటూ ఓ లైన్‌మెన్‌కు సాక్షాత్తు రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి ఇలా బెదిరించారు. ఇంటికి కరెంట్ బిల్లు కోసం లైన్‌మెన్ రమేష్ వెళ్లాడు. అందరి ముందు బిల్లు అడుగుతావా అంటూ ఎమ్మెల్యే తిట్టిపోశాడు. అంతటితో ఆగకుండా వార్నింగ్‌లిచ్చేశాడు. 
 
అలాగే విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎయిర్‌పోర్టులో పోలీసులపై శివాలెత్తారు. మొన్నటికిమొన్న నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్యులపై ఆయన ధ్వజమెత్తారు. బస్సు ప్రమాద మృతులకు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టు ఇవ్వాలంటూ జగన్ తన సహనాన్ని కోల్పోయారు. పోలీసుల నుంచి కలెక్టర్ వరకు అందరూ అవినీతిపరులు తయారైనారని ఆరోపించారు. సెంట్రల్‌జైలుకు పంపుతానంటూ కలెక్టర్‌కు వార్నింగ్ ఇచ్చారు. వైకాపా అధినేతే ఇలా శివాలెత్తితే అనుచరులు, ఇతర నేతలు తక్కవ తిన్నారా. ఏపీ డీజీపీ సర్కార్‌కు బానిసైనారని ఆరోపించారు. మహిళా పార్లమెంటు సదస్సు తాను వెళుతుంటే దౌర్జన్యంగా అరెస్ట్ చేశారని రోజా విమర్శించారు. అటు కడప కలెక్టర్ సత్యనారాయణను చొక్కాపట్టుకుని నిలదీస్తామంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి శెలవిచ్చారు. ఇక టీడీపీలో నోటి దురుసు ఎక్కువున్న వ్యక్తిగా పేరున్న ఆనం వివేకానందరెడ్డి  రోజాపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారు. 
 
వైసిపి అధినేత జగన్ కార్యక్రమాల్లో రోజాకు రికార్డింగ్ డ్యాన్సులే గతి అని తీవ్రంగా మండిపడ్డారు. రోజాకు జబర్దస్త్ ప్రోగ్రామ్ అయిపోతే జగన్ ప్రోగ్రాముల్లో రికార్డింగ్ డ్యాన్సులే మిగులుతాయని ఎద్దేవా చేశారు. జగన్‌ను 130 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ, 33 ఏళ్ల తెలుగుదేశం పార్టీలు ఏం చేయలేకపోయాయని చెప్పారు. కానీ రోజా ఎక్కడ పాదం మోపితే అక్కడ ఆ పార్టీ సర్వనాశనం ఖాయమని జోస్యం చెప్పారు.
 
అలాగే వైఎస్ జగన్, ఎమ్మెల్యే రోజాలపై టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. జగన్.. తమ పార్టీ ఎమ్మెల్యే రోజా నోరును అదుపులో పెట్టాలని, లేదంటే ప్రజలు వారికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. రోజాకు పిచ్చిపట్టిందని ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని విమర్శించే స్థాయి రోజాకు లేదన్నారు. సుప్రీం కోర్టు చివాట్లు పెట్టినా రోజా తీరు మార్చుకోలేదని ధ్వజమెత్తారు. ఇలా వ్యక్తిగత విమర్శలు, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాప్రతినిధులు పోటీపడుతున్నారే కానీ.. ప్రజా సమస్యలేంటి? వాటి పరిష్కారం కోసం పాటుపడుతున్నామా? లేదా అనేదానిపై దృష్టి పెట్టడం చాలామటుకు తగ్గించేశారని ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు తమతమ వైఖరులను మార్చుకుంటారేమోనని ప్రజలు ఆశగా చూస్తున్నారు.