మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : బుధవారం, 30 జులై 2014 (18:48 IST)

భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌ - తెలంగాణాలు మరో భారత్ - పాక్‌లేనా?!!

భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మరో భారత్, పాకిస్థాన్‌లుగా మారే అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్నకు మేధావులు అవుననే చెపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసే ప్రతి చర్య ఆ విధంగానే ఉందని వారు పేర్కొంటున్నారు. ముఖ్యంగా.. ప్రతి చిన్న విషయానికి ఆజ్యం పోస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ప్రతి రోజూ ఒక జీవోతో రెండు రాష్ట్రాల్లో ఏదో ఒక వివాదం రేపేందుకు ఇరు ప్రాంతాల నేతలు ఒకరిని మించి ఒకరు పోటీపడుతున్నట్టు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన కోసం పెరిగిన విద్వేషాన్ని కొనసాగించడంలో తెలంగాణ ప్రభుత్వం అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా వాడుకుంటూ.. విద్వేషాలు రగిల్చడంలో సక్సెస్ అవుతోందని ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు. 
 
తాజాగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రాంతానికి వచ్చే వాహనాలన్నీ రవాణా పన్ను చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం, రాజధాని నగరాన్ని తక్షణమే సీమాంధ్ర ప్రాంతానికి తరలించుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చెప్పడం అగ్నికి ఆజ్యంపోయడమేనని వారు పేర్కొంటున్నారు. నిజానికి 2015 యేడాది ఆఖరు వరకు రవాణాపన్ను విధించకూడదని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా ఉంగి, ఈ మేరకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఓ జీవోను కూడా జారీ చేశారు. దీన్ని తుంగలో తొక్కుతూ.. తెలంగాణ ప్రభుత్వం సవరణ జీవోను జారీ చేసి... ఉమ్మడి రాజధానికి వచ్చే ఆంధ్రుల వాహనాలను నానా రకాలైన ఇబ్బందికి గురి చేయాలన్న లక్ష్యంతో పన్ను విధించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం రెండు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేసింది. 
 
మరోవైపు ఏపీకి కేటాయించిన పాత అసెంబ్లీ హాలు చారిత్రక భవనం కనుక దానికి మరమ్మతులు చేయడం సరికాదని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రామలింగారెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, మరమ్మత్తులు చేయడం సీమాంధ్రుల ఆగడం అని కూడా ఆయన అనేశారు. ఆంధ్రప్రదేశ్ నేతలు రాజధానిని తక్షణమే వదిలివెళ్తే బాగుంటుందని రామలింగారెడ్డి ఉచిత సలహా కూడా ఇచ్చారు. 
 
ఇకపోతే.. ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ఇప్పుడే నిర్వహించకూడదని, తాము నిర్వహించనున్న 'ఫాస్ట్' (ఫైనాన్షియల్ ఎయిడ్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ) పథకం రూపొందిన తర్వాత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ను అక్టోబరు వరకు వాయిదా వేయాలంటూ ఉన్నత విద్యాశాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా గైర్హాజరైంది. 
 
అలా చేస్తే విద్యార్థులు విలువైన విద్యా సంవత్సరం కోల్పోతారని, దాని ప్రభావం వారి పీజీ ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలపై కూడా పడుతుందని విద్యావేత్తలు చెపుతున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పైకా ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు పరిధిలోకి తీసుకెళ్లింది. ఇవి కాకుండా విద్యుత్తు, కృష్ణా జలాల పంపిణీలో రెండు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఫీజు రీయింబర్స్ మెంట్ వివాదం ఉండనే ఉంది. 
 
ఇవికాకుండా, ఉద్యోగుల పంపిణీ, స్థానికత వివాదం మరింత ఆందోళనలోకి నెడుతున్నాయి. రాష్ట్ర విభజన అస్పష్టంగా ఉండడంతో రెండు రాష్ట్రాల మధ్య యుద్ధం ఒక్కటే తక్కువ తప్ప నేతల వ్యవహార శైలితో ఆ ముచ్చట కూడా తొందర్లోనే తీరిపోనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర విభజనంటూ జరిగితే ఇరు రాష్ట్రాల మధ్య ఈ తరహా వాతావరణం నెలకొనడం ఖాయమని సాధారణ పౌరులు, మేధావులు, శ్రీకృష్ణ కమిటీ సభ్యులు వ్యక్తం చేయగా, వాటిని తెలంగాణ ప్రభుత్వం ఆక్షరాలా ఆచరణలో పెట్టి చూపుతోంది.