శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Modified: శనివారం, 28 మే 2016 (14:59 IST)

సుజ‌నాకు ఓకే... నిర్మ‌లా సంగ‌తే డౌట్... హరికృష్ణ అడుగుతున్నారట...

విజ‌య‌వాడ: రాజ్య‌స‌భ ఢంకా మోగింది... కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అభ్య‌ర్థుల జాబితా ఇంకా తేల్చ‌లేదు టీడీపీ. ఏపీలో తెలుగుదేశానికి 3 సీట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. నాలుగో సీటు వైసీపీది కాగా.. అది కూడా వారికి ద‌క్క‌కుండా చేయాల‌నే ప్లాన్లో టీడీపీ ఉంది. ము

విజ‌య‌వాడ: రాజ్య‌స‌భ ఢంకా మోగింది... కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అభ్య‌ర్థుల జాబితా ఇంకా తేల్చ‌లేదు టీడీపీ. ఏపీలో తెలుగుదేశానికి 3 సీట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. నాలుగో సీటు వైసీపీది కాగా.. అది కూడా వారికి ద‌క్క‌కుండా చేయాల‌నే ప్లాన్లో టీడీపీ ఉంది. ముందుగా టీడీపీ త‌న సీట్ల విష‌యానికి వ‌స్తే, ఇప్ప‌టికే కేంద్ర మంత్రులుగా ఉన్న‌ సుజ‌నా చౌద‌రి, నిర్మ‌లా సీతారామ‌న్ల విష‌యం తేల్చాల్సి ఉంది. ఆర్థిక కేసులో ఇరుక్కున్న సుజ‌నాకు తిరిగి రాజ్య‌స‌భ టిక్కెట్ ఇస్తారా అనే మీమాంశ ఇంత‌వ‌ర‌కూ ఉండేది. కానీ, దీనిపై ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన టీడీపీ అధిష్ఠానం... మ‌రోసారి సుజ‌నాకు ఓకే చెప్ప‌బోతోంది. 
 
ఎందుకంటే, ఢిల్లీలో లాబీయింగ్లో కేంద్రమంత్రిగా సుజ‌నా పాత్ర టీడీపీకి ఎంతో అవ‌స‌రం అని భావిస్తున్నారు. త‌న‌కు టిక్కెట్ రాదేమో అని కినుక వ‌హించి, దూరం జ‌రిగిన సుజ‌నా... ఇటీవ‌ల త‌న కుమారుడి వివాహ స‌మ‌యంలో సీఎం చంద్ర‌బాబుతో మంత‌నాలు జ‌రిపి... అంతా సెట్ చేసుకున్న‌ట్లు స‌మాచారం. దీనితో సుజ‌నా టిక్కెట్ ఓకే. ఇక బీజేపీ కోసం నిర్మ‌లా సీతారామ‌న్ టిక్కెట్ విష‌య‌మే చ‌ర్చ‌ల‌లో ఉంది. ఆమె గురించి కాక‌పోయినా... ఏపీ నుంచి త‌మ‌కు ఒక సీటుకు స‌హ‌క‌రించాల‌ని బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా... టీడీపీని కోరుతున్నారు. అయితే, దీనికి ఓకే అనాలా వ‌ద్దా అని చంద్ర‌బాబు ఆలోచిస్తున్నారు. 
 
ఏపీకి ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తి తేల్చ‌ని త‌రుణంలో బీజేపీకి స‌హ‌క‌రిస్తే, ఎలాంటి సంకేతాలు తెలుగు ప్ర‌జ‌ల‌లోకి వెళ‌తాయ‌నే మీమాంశ ఉంది. కానీ, ఇప్ప‌ట్లో బీజేపీ తెగ‌తెంపులు లేవు కాబ‌ట్టి... వారు చెప్పిన అభ్య‌ర్థికి టీడీపీ స‌హ‌క‌రించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. మూడో టిక్కెట్ ఎస్సీలకు ఇవ్వాల‌ని టీడీపీ భావిస్తోంది. మ‌ధ్య‌లో కాపుల‌కు ఇవ్వాల‌ని డిమాండు కూడా వచ్చింది. ముద్ర‌గ‌డ‌కు రాజ్య‌స‌భ ఇచ్చి... మ‌న‌వైపు తిప్పుకుందామ‌ని కొంద‌రు టీడీపీలో ఆలోచ‌న చేశారు. కానీ, ముద్ర‌గ‌డ అందుకు అంగీక‌రించ‌లేద‌ని తెలుస్తోంది. దీనితో ఎస్సీల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. అందులో టీడీపీకి, చంద్ర‌బాబుకు న‌మ్మినబంటు మాజీ మంత్రి జె.ఆర్.పుష్ప‌రాజ్ పేరు ముందు ఉన్న‌ట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే హేమలత పేరు కూడా వినిపిస్తున్నది. ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ కూడా ఈ సీటును ఆశిస్తున్నట్టు సమాచారం. అయితే, చంద్ర‌బాబు ఎవరికి కేటాయిస్తారన్న అంశంపై సందిగ్ధత నెలకొంది.
 
ఇక నాలుగో సీటు వైసీపీ ద‌క్క‌కుండా చ‌క్రం తిప్పాల‌ని టీడీపీ నేత‌లు వ్యూహాలు ప‌న్నుతున్నారు. ఇటీవ‌ల టీడీపీలో చేరిక‌ల‌తో 121 ఎమ్మెల్యేల‌య్యారు. మ‌రో 20 మందిని లాక్కుంటే, వైసీపీకి ఆ ఒక్క రాజ్య‌స‌భ సీటూ ద‌క్క‌కుండా పోతుంద‌నే ఆలోచ‌న‌లో టీడీపీ ఉంది. దీనికి నెల్లూరు జిల్లా నుంచి వైసీపీ నేత, పారిశ్రామికవేత్త వేమూరి ప్ర‌భాకర్ రెడ్డిని ఎంచుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి టీడీపీ పాచిక ఎంతవర‌కూ పారుతుంది. వైసీపీ అధినేత జ‌గ‌న్ ఫిరాయింపుల నిరోధ‌క చ‌ట్టాన్ని ఎంత‌వ‌ర‌కు వాడుకోగ‌ల‌ర‌నే దానిపై ఆధార‌ప‌డి ఉన్నాయి.