శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Updated : శుక్రవారం, 29 జులై 2016 (17:03 IST)

100 శాతం అనుమానం లేదు.. ఏపీకి ప్రత్యేక హోదా రాదు... ఏపీలో తెదేపా ఔటేనా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రకటించారు. దీనితో ఇక ఎంతమాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదని స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు నిబంధనలు అడ్డువస్తున్నాయంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రకటించారు. దీనితో ఇక ఎంతమాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదని స్పష్టమైంది. రాజ్యసభలో దాదాపు పార్టీలన్నీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పినప్పటికీ అరుణ్ జైట్లీ మాత్రం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టంలో ఏ అంశాలను జోడించి ఉన్నాయో వాటిని మాత్రమే నెరవేరుస్తామని స్పష్టీకరించారు. ప్రత్యేక హోదాకు అనేక నిబంధనలు అడ్డు వస్తున్నాయని చర్చలో తేటతెల్లం చేశారు. ఆ నిబంధనలన్నీ తోసిరాజని తాము ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే దేశంలో చాలా రాష్ట్రాలు తమకు కూడా ప్రత్యేక హోదా ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తున్నాయని వెల్లడించారు.
 
ఇకపోతే భాజపా వైఖరి స్పష్టం కావడంతో ఏపీలో తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన తెదేపా దిక్కుతోచని స్థితిలో పడిపోయినట్లయింది. ఎన్నికల సమయంలో అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీని వెంటబెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడమే కాకుండా ఆ అంశాన్ని తమ మేనిఫెస్టోలో కూడా జోడించారు. కానీ ఇప్పుడు ఎన్డీఏ వైఖరితో ఏం చేయాలో తోచని స్థితిలో పడిపోయింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. 
 
ఎన్డీఏ నుంచి వైదొలిగితే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కొట్టుకుంటున్న ఏపీని ముందుకు నడిపించడం చాలా కష్టం. అందువల్ల ఎన్డీఏ నుంచి బయటకు రాలేని స్థితి. అలాగని ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఇబ్బందులున్నాయని చెప్పాక కూడా భాజపా ఆధ్వర్యంలోని ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగితే అది భవిష్యత్తులో తెదేపాను రాజకీయంగా దెబ్బతీయడం ఖాయం. ఇది ఒక రకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సువర్ణవకాశమే అవుతుంది. తదుపరి 2019లో ఏపీ ప్రజలు, ఒకవేళ తెదేపా ప్రత్యేక హోదా సాధించలేకపోతే... వైకాపాకు మద్దతు పలకడం ఖాయం అనుకోవచ్చు. మరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి రాజకీయ ఎత్తుగడలతో ఈ గండం నుంచి గట్టెక్కుతారో వేచి చూడాల్సిందే.