శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : శనివారం, 20 ఆగస్టు 2016 (12:54 IST)

తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదానికిగురయ్యే వాహనంపై శాశ్వత నిషేధం

తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదాలను పూర్తిగా అరికట్టడానికి తితిదే విజిలెన్స్, సెక్యూరిటీ విభాగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. అనుమతి నిరాకరణలో కొరడా ఝళిపిస్తోంది. ప్రమాదాలకు కారణమైన ప్రైవేట్ వాహనాలను శాశ్వ

తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదాలను పూర్తిగా అరికట్టడానికి తితిదే విజిలెన్స్, సెక్యూరిటీ విభాగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. అనుమతి నిరాకరణలో కొరడా ఝళిపిస్తోంది. ప్రమాదాలకు కారణమైన ప్రైవేట్ వాహనాలను శాశ్వతంగా కొండ ఎక్కకుండా నిషేధించడం ద్వారా డ్రైవర్లలో ఒక విధమైన భయం కలిగించడానికి ప్రయత్నాలు చేపట్టింది. ఈ ప్రయత్నం కొంత విజయవంతమైనట్లు కనిపిస్తోంది. ప్రమాదాలు కూడా తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. 
 
తిరుమల - తిరుపతి ఘాట్‌రోడ్డులో పైకి ఎక్కడానికి, దిగడానికి సమయం నిర్ధేశించారు. నిర్ధేశించిన సమయం కంటే ముందుగా గమ్యస్థానం చేరుకుంటే చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల అతివేగాన్ని చాలా వరకు నియంత్రించగలిగారు. అయినప్పటికీ ఇప్పటికీ ప్రైవేటు జీపులు, టాక్సీలు పెద్ద సంఖ్యలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. దీంతో అనుమతి నిరాకరణకు గురవుతున్నాయి. వాహనాన్ని వేగంగా నడిపితే వారం రోజుల పాటు కొండకు అనుమతించకుండా ఆపేస్తున్నారు. వాహనం నెంబరును కంప్యూటర్‌లో ఫీడ్‌ చేస్తే చాలు.. ఇక ఆ వాహనం ఎప్పుడు వచ్చినా నెంబరు కొట్టగానే అనుమతి నిరాకరణ అంటూ నోటీసు కనిపిస్తుంది.
 
దీంతో వాహనాన్ని వెనక్కి పంపేస్తారు. మళ్ళీ కంప్యూటర్‌లో అనుమతి నిరాకరణ తొలగించేదాకా అలాగే ఉంటుంది. ఇలాంటి వాహనాలను వారం పాటు అనుమతి నిరాకరణలో పెట్టడంతో పాటు శ్రీవారి కానుక (ఫైన్‌) కట్టించి వదిలేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై నెలాఖరు దాకా 5,654 వాహనాలపై ఈ తరహా చర్యలు తీసుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే మార్చి, ఏఫ్రిల్‌, మే నెలల్లోనే అనుమతి నిరాకరణ ఎక్కువగా ఉన్నాయి. మార్చిలో 1,236, ఏఫ్రిల్‌లో, మే నెలల్లో అనుమతి నిరాకరణ వాహనాలు కూడా ఉన్నాయి. గత నెలలోను ఈ సంఖ్య భారీగానే ఉంది. జూలై 1,221 వాహనాలున్నాయి. గత యేడాది జనవరి నుంచి డిసెంబర్‌ దాకా 4,829 వాహనాలను అనుమతి నిరాకరణగా పెట్టారు. ఈ యేడాది జూలై నాటికే ఆ సంఖ్య 5,654గా ఉంది. అంటే ఎలాంటి మినహాయింపులు లేకుండా సమయ నిబంధన వర్తింజేస్తున్నారన్నమాట.
 
గతంలో ఘాట్‌రోడ్డులో ప్రమాదాలకు కారణమైన వాహనాలను కొన్ని నెలల పాటు అనుమతి నిరాకరణకు పెట్టేవారు. ఆ తర్వాత అనుమతి ఇచ్చేవారు. ఇప్పుడు అలాంటి వెసులుబాటు కూడా లేకుండా చేశారు. ఏదైనా అద్దె వాహనం యాక్సిడెంట్‌కు కారణమైతే ఇక అది శాశ్వతంగా తిరమలకు వచ్చే అవకాశం కోల్పోతుంది. ఇప్పటిదాకా దాదాపు 30 వాహనాలను శాశ్వత అనుమతి నిరాకరణలో పెట్టినట్లు తెలుస్తోంది. ఆ వాహనాలను అనుమతించాలని వాహన యజమానులు బతిమాలుతున్నా అధికారులు ససేమిరా అంటున్నారు. 
 
ఈఓ అనుమతి లేనిదే ఇలాంటి వాహనాలను తిరిగి అనుమతించబోమని విజిలెన్స్ అధికారులు తేల్చి చెప్పేస్తున్నారు. అయితే ఇది కొంత వివాదానికి దారితీస్తోంది. డ్రైవర్లు చేసిన తప్పుకు వాహనాన్ని శాశ్వతంగా కొండకు రానివ్వకుంటే తమ జీవనోపాధి ఏమి కావాలి అని వాహనాల యజమానులు ప్రశ్నిస్తున్నారు. మంచి డ్రైవర్లను నియమించాల్సిన బాధ్యత యజమానులదే. డ్రైవింగ్‌ తెలియని వారి చేతికి వాహనం ఇచ్చి పంపుతున్నారు. అలాంటి వారి వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలకు యజమాని కూడా బాధ్యత వహించక తప్పదు అంటున్నారు తితిదే అధికారులు.