శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2016 (17:06 IST)

కోదండరామ్ - కేసీఆర్‌ల మధ్య లడాయి ఈనాటిది కాదు... సోనియాకిచ్చిన మాటతో బీజం పడింది!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీ జేఏసీ ఛైర్మన్‌గా ప్రొఫెసర్ కోదండరామ్ అత్యంత కీలక భూమిక పోషించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆయన ఎందుకూ పనికిరాకుండా పోయారనే నిర్మొహమాటంగా చె

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీ జేఏసీ ఛైర్మన్‌గా ప్రొఫెసర్ కోదండరామ్ అత్యంత కీలక భూమిక పోషించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆయన ఎందుకూ పనికిరాకుండా పోయారనే నిర్మొహమాటంగా చెప్పొచ్చు. ఒకపుడు... ఆయన ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టిన తెరాస అధినేత కేసీఆర్.. ముఖ్యమంత్రి అయ్యాక కోదండరామ్‌కు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడంలేదు. ఇది ప్రొఫెసర్‌ను తీవ్రంగా బాధించింది. ఆయన అవమానంగా భావించారు కూడా.

అదేసమయంలో ఆయన అదును కోసం వేచిచూస్తూ వచ్చారు. అనుకున్నట్టుగానే తెరాస ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్ళు పూర్తి చేసుకుంది. ఇదేఅదునుగా భావించిన కోదండరామ్ తెరాస సర్కారు రెండేళ్ళ పాలనపై విమర్శలు గుప్పించారు. ఒకరు విమర్శ చేస్తే సహించలేని కేసీఆర్... తన మంత్రులతో ప్రతిదాడి చేయించారు. ఇంతవరకు అందరికీ తెలిసిందే. అయితే, ఈ లడాయికి గతంలోనే బీజం పడిందని చెప్పాలి. అది నాటి నుంచి నేటి వరకు నివురు గప్పిన నిప్పులా ఉంది. అదేంటో పరిశీలిద్ధాం. 
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై రెండేళ్లు పూర్తి చేసుకుంది. సరిగ్గా రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికలలో తెరాసకు బాహాటంగా మద్దతు ప్రకటించాలని కోదండరామ్‌ను కేసీఆర్ కోరగా, ఆయన దానికి నిరాకరించారు. దీనికి కారణం లేకపోలేదు. రాష్ట్ర విభజనకు అంగీకరించిన కాంగ్రెస్‌ పార్టీ కోదండరామ్‌ను ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించుకుని ఎన్నికలలో తమ పార్టీకే మద్దతు ప్రకటించాలని కోరింది. అపుడు ఆయన తన మనసులోని మాటను బహిర్గతం చేశారు. ఎన్నికల్లో తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోమనీ, తటస్థంగా ఉంటామని తేల్చి చెప్పారు. 
 
పిమ్మట రాష్ట్ర విభజన చట్టానికి పార్లమెంట్‌ ఆమోదముద్ర వేసింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో కోదండరామ్‌ తమకు మద్దతు ప్రకటించాలని తెరాస కూడా ఆశించింది. అయితే కాంగ్రెస్‌కు ఇచ్చిన మాట ప్రకారం తటస్థంగానే ఉండాలని కోదండరామ్‌ నిర్ణయించుకున్నారు. దీంతో, ఆనాడు మొదలైన విభేదాలు ఇప్పుడు బయటపడి పరస్పరం విమర్శించుకునే వరకు వచ్చాయి. కోదండరామ్‌ నిర్ణయంతో పట్టుదల పెరిగిన కేసీఆర్‌ ఎన్నికల సందర్భంగా గతంలో ఎన్నడూలేని విధంగా తెలంగాణలో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించి పార్టీని అధికారంలోకి తెచ్చారు. 
 
అదేసమయంలో తెలంగాణలో తనకు రాజకీయంగా ఎదురులేకుండా ఉండాలన్న సంకల్పంతో ఉపఎన్నికలకు ముందే రాజకీయ జేఏసీని బలపరిచే చర్యలకు శ్రీకారం చుట్టారు. జేఏసీలో కీలక వ్యక్తులుగా ఉన్న కొంతమందిని తనవైపుకు తిప్పుకుని వారికి పదవులు కట్టబెట్టారు. అదేసమయంలో ఉద్యోగ సంఘాల నాయకులను జేఏసీకి దూరం చేశారు. దీంతో జేఏసీ బలహీనపడి కోదండరామ్‌ దాదాపు ఏకాకిలా మిగిలిపోయారు. ఇష్టంలేని వారితో కఠువుగా వ్యవహరించే ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఈ క్రమంలోనే కోదండరామ్‌ను దూరం పెట్టారు. కలవడానికి అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు. దీన్ని కోదండరామ్ అవమానంగా భావించారు. 
 
పేదవాడి కోపం పెదవికి చేటు అన్న సామెతను గుర్తుకు తెచ్చుకుని కాబోలు కోదండరామ్‌ ఇంతకాలం మౌనాన్ని ఆశ్రయించారు. కేసీఆర్‌ రెండేళ్ల పాలన పూర్తి అయిన సందర్భంగా ఇక ఉండబట్టలేక నోరు విప్పి ప్రభుత్వ పనితీరును విమర్శించారు. ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తూ వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో టీఆర్‌ఎస్‌ మంత్రులు, నాయకులు కోదండరామ్‌పై విరుచుకుపడ్డారు. తన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ నేతలు అంతలా విరుచుకుపడతారని కోదండరామ్‌ ఊహించి ఉండరు. 
 
కేసీఆర్‌ను రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్న ప్రతిపక్షాలు అవకాశం చిక్కిందన్న ఉద్దేశంతో కోదండరామ్‌కు అండగా నిలవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అదేసమయంలో రెట్టించిన ఉత్సాహంతో గ్రామస్థాయి నుంచి జేఏసీని పటిష్టపరుస్తామని ప్రకటించారు. పైగా, ప్రజా సమస్యలపై తెలంగాణ విపక్ష పార్టీలను కలుపుకుని ముందుకు సాగనున్నట్టు ప్రకటించారు. దీంతో కేసీఆర్ - కోదండరామ్ వైరం మున్ముందు ప్రచ్ఛన్న యుద్ధంగా మారే అవకాశాలు లేకపోలేదు.