శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : సోమవారం, 9 నవంబరు 2015 (14:04 IST)

నాడు మోడీని గెలిపించిన వ్యక్తే.. నేడు మోడీని ఓడించారు.. ఎవరతగాడు?

గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్ర మోడీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఒంటి చేత్తో.. బీజేపీని అతిపెద్ద పార్టీగా అవతరింపజేశారు. అయితే, ఈ అద్భుతమైన విజయం వెనుక ఓ వ్యక్తి వ్యూహాలు, సోషల్ మీడియా ప్రచారం దాగివుంది. ఆ వ్యక్తి పేరు ప్రశాంత్ కిషోర్. ఐక్యరాజ్య సమితి మాజీ ఉద్యోగి. ఆ వ్యక్తే ఇపుడు ప్రధానమంత్రి హోదాలో బీహార్ ఎన్నికల ప్రచారాన్ని తన భుజాలపైకి ఎత్తుకున్న నరేంద్ర మోడీని చిత్తుచిత్తుగా ఓడించారు. అది ఎలాగో ఓ సారి పరిశీలిద్ధాం... 
 
ఆఫ్రికాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధిగా 2011 వరకు పనిచేసిన ప్రశాంత్ కిషోర్ 37 ఏళ్ల వయసున్న ఉన్నత విద్యావంతుడు. ఐక్యరాజ్య సమితిలో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి.. 2011లో మాతృదేశానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఎంబీఏ, ఐఐటీ పట్టభద్రులతో ఓ పటిష్టమైన జట్టును తయారుచేసుకుని నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి చేరువయ్యారు. ఆ తర్వాత దేశంలో ఎన్నికల ప్రచారాన్ని కొత్తపుంతలు తొక్కించారు.
 
సోషల్ మీడియాలో ప్రచారాన్ని హోరెత్తించిన ప్రశాంత్ 'చాయ్ పే చర్చా' పేరిట వినూత్న ప్రచారానికి తెరతీశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ‘చాయ్ పే చర్చా’ దేశవ్యాప్తంగా ఓటర్లను ఆకట్టుకుంది. బీజేపీకి ఓట్లను రాల్చింది. గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోడీ ప్రధాని పీఠం ఎక్కేందుకు ప్రధాన భూమిక పోషించింది. ఈ వ్యక్తి బీహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లా వాసి. 
 
ఈ వ్యక్తిని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆకర్షించారు. వారిమధ్య ఏర్పడిన పరిచయంతో సీఎం నితీశ్‌కు ప్రశాంత్ దగ్గరయ్యాడు. మహాకూటమి ప్రచారాన్ని తన భుజాలపైకి తీసుకుని... కొత్త పుంతలు తొక్కించారు. నితీశ్ పదేళ్ల పాలనపై సమీక్ష చేద్దామంటూ ఆయన తెరపైకి తెచ్చిన 'పర్చా పే చర్చా' బీహారీలను అమితంగా ఆకట్టుకుంది. ఫలితంగా పదేళ్ళ నితీశ్ ప్రభుత్వ వ్యతిరేకత మటుమాయమైంది. బీజేపీ నేతృత్వంలోని ఏన్డీఏ కూటమికి షాకిచ్చిన బీహారీ ఓటర్లు అప్పటికే పదేళ్ల పాటు సీఎంగా పనిచేస్తున్న నితీశ్‌కే పట్టం కట్టారు. నాడు మోడీని ఓడించిన ఈ వ్యక్తి.. ఇపుడు ఇదే మోడీని 'పర్చా పే చర్చా' ద్వారా ఓడించి అందరి దృష్టి తనవైపునకు తిప్పుకున్నారు.