శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : శనివారం, 28 మార్చి 2015 (13:10 IST)

బీజేపీకి దగ్గరవుతున్న వైసీపీ..? రాష్ట్రంలో మారుతున్న సమీకరణలు

రాష్ట్రంలో పరిస్థితులను చూస్తుంటే భారతీయ జనతాపార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల నాటకీయ పరిణామాలతో ఈ విషయం తేట తెల్లమవుతోంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన వైఎస్ ఆర్సీపీ వెంటనే భారతీయ జనతా పార్టీ జోక్యంతో దానిని వెనక్కి తీసుకోవడం అన్నీ వెంటనే జరిగిపోవడం చూస్తే... భారతీయ జనతాపార్టీకి వైఎస్ఆర్సీపీ దగ్గరవుతోందనే తెలుస్తుంది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఈ పర్యాయం యుద్ధమే జరిగింది. ప్రత్యేకించి స్పీకర్ శివప్రసాద్ రావు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి మధ్యన మాటల తూటాలు పేలాయి. చివరకు ఏ స్థాయికి వెళ్లిందంటే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం వెనువెంటనే వైసీపీ కూడా అందుకు తగ్గట్టుగానే స్పీకరుపై ఏకంగా అవిశ్వాస తీర్మానాన్నే ప్రవేశపెట్టింది. తమ ఎమ్మెల్యేలను సస్పెండు చేయడంతోపాటు సమయాన్ని కేటాయించకపోవడంతో శాసనసభ బయట కూడా పోరాటం చేసింది. గతంలో ఏ స్పీకరుపైనా రానన్ని ఆరోపణలు శివప్రసాద్ మూటగట్టుకున్నారు. ఇదిలా ఉండగా పరిస్థితి రోడ్డుపైకి వచ్చిందని తేలిపోయింది. 
 
ఈ పరిణామాలను భారతీయ జనతాపార్టీ చక్కగా వినియోగించుకుంది. పార్టీ అధిష్టానం ఆదేశాలను అనుసరిచింది. బిజేపీ శాసనసభా పక్ష నాయకుడు విష్ణువర్ధన్ రాజు వైసిపితో రాయబారం మొదలు పెట్టారు. వైసీపీతో చర్చలు జరిపి శాసనసభకు రావాలని కోరారు. ఇలా శాసనసభకు దూరంగా ఉండడంవలన జనానికి నష్టం జరుగుతుందని నచ్చజెప్పారు. అసలు శాసనసభా సమావేశాలకు హాజరుకావడం లేదని ప్రకటించిన వైసిపి శాసనసభకు హాజరయ్యింది. 
 
అప్పటికే స్పీకర్ పై అవిశ్వాస తీర్మాన నోటీసును జారీ చేసిన వైసిపితో విష్ణువర్ధన రాజు మరోమారు చర్చలకు ఉపక్రమించారు. మొదట వచ్చే నెల 4న అవిశ్వాస తీర్మానంపై చర్చ పెట్టాలని బిఏసీలో నిర్ణయంచారు. తరువాత బీజేపీ రాయబారంతో అవిశ్వాస తీర్మానమే లేకుండా వైసీపీని ఒప్పించారు. శుక్రవారం వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మాన నోటీసును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు కూడా ఆసక్తికరంగా మిగిలాయి. 
 
శాసనసభలో స్పీకర్ సమయం కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పైగా నేరుగానే బీజేపీ రాయబారాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడడం చూస్తే భారతీయ జనతా పార్టీకి వైసీపీ దగ్గరవుతోందని తెలుస్తోంది. స్పీకర్ సమయం కేటాయించేలా చేస్తామని విష్ణుకుమార్ రాజు భరోసా ఇచ్చనట్లు చెప్పారని అన్నారు. అయితే విష్ణు కుమార్ రాజు కేవలం భారతీయ జనతాపార్టీ ప్రతినిధి మాత్రమే అధిష్టానమే వెనకుండి నడిపిస్తోందని తెలుస్తోంది. చంద్రబాబుకు ముకుతాడు వేయాలంటే జగన్ ను మచ్చిక చేసుకోక తప్పదని గ్రహించిన బీజేపీ ఈ ఎత్తులు వేసినట్లు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.