శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : బుధవారం, 15 జులై 2015 (17:04 IST)

''అమ్మ''కు తర్వాత అన్నాడీఎంకేకు వారసుడేడి..?! రజనీయా.. పన్నీరేనా..?

తమిళనాడు సీఎం జయలలితకు ఆరోగ్యం సరిగా లేదంటూ వచ్చిన వదంతుల నేపధ్యంలో 'అమ్మ' తర్వాత అన్నాడీఎంకే పార్టీ పరిస్థితి ఏంటని ప్రస్తుతం ఆ పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. జయ ఆరోగ్య పరిస్థితులపై క్లారిటీ ఇచ్చినా.. వయస్సు మీద పడే కొద్దీ జయమ్మ తర్వాత అన్నాడీఎంకే పరిస్థితి ఏమౌతుందనే ఆలోచన అందరిలోనూ వుంది. ఇంతకీ అన్నాడీఎంకే పార్టీకి సరైన వారసుడు ఎక్కడనే దానిపై తమిళనాట జోరుగా చర్చ సాగుతోంది. అలాగే ప్రతిపక్షమైన డీఎంకే పార్టీకైనా వారసులున్న తరుణంలో అమ్మకు మాత్రం వారసులు లేకపోవడంపై పార్టీ కార్యకర్తల్లో ఆందోళన రేకెత్తింది. 
 
తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకే క్రేజ్ ఎక్కువున్న తరుణంలో ఈ రెండూ పార్టీలకూ ఆశించిన స్థాయిలో పార్టీని సమర్థవంతంగా నడిపే నాయకులు కరువయ్యారు. డీఎంకేకు స్టాలిన్ ఉండటంతో ఆ పార్టీ కాస్త గట్టెక్కే పరిస్థితి కనబడుతోంది. అయితే అన్నాడీఎంకే పార్టీ విషయంలో మాత్రం అమ్మకు వారసులు లేకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో కాస్త గందరగోళంలో ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో అమ్మ తనకు వీర విధేయుడైన పన్నీర్ సెల్వానికే పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని టాక్ వస్తోంది. మరోవైపు తమిళనాడులో మంచి పలుకుబడి వున్న సూపర్ స్టార్ రజనీకాంత్‌కే అన్నాడీఎంకే పగ్గాలు అప్పగించే విషయంపై కూడా చర్చ సాగుతోంది. అందుకే బీజేపీలో చేరమని రజనీకాంత్‌ను అగ్రనేతలు సంప్రదింపులు జరిపినా ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టి తద్వారా కేంద్రంలోని బీజేపీకి సపోర్ట్ చేసేందుకే రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారని తమిళనాట జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై అమ్మ ఏమంటారో.. రజనీకాంత్ ఏమంటారో వేచి చూడాల్సిందే.