శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : సోమవారం, 27 జూన్ 2016 (11:53 IST)

తిరుమల "నో ఫ్లెయింగ్‌ జోన్‌" సాధ్యం కాదా! చీరాలకు ఇవ్వగా.. తిరుమలకు ఇవ్వలేరా?

కోట్లాది హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల క్షేత్రం మీదుగా విమాన రాకపోకలకు నిషేధించాలని తితిదే చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. దీనిపై కొందరు నిరసన వ్యక్తం చ

కోట్లాది హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల క్షేత్రం మీదుగా విమాన రాకపోకలకు నిషేధించాలని తితిదే చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. దీనిపై కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. భద్రతా కోణంలో కొందరు, పవిత్రత కోణంలో కొందరు తిరుమలను నో ఫ్లెయింగ్‌ జోన్‌గా ప్రకటించాలని కోరుతున్నారు. ఇది అసంబద్ధమైన డిమాండ్‌ ఏమీ కాదు. అయినా కేంద్రం తిరస్కరించింది.. ఎందుకు..? కేంద్రం తీసుకున్న నిర్ణం సహేతుకమైనదా? కాదా? ఈ సమస్యను ఎలా అర్థం చేసుకోవాలి...?
 
నిత్యం 60 వేలు -70 వేల మంది భక్తులు సందర్శించే తిరుమలకు తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి వున్న మాట వాస్తవం. తిరుమలలో జరగరానిది జరిగితే కోట్లమంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయనడంలో సందేహం లేదు. తిరుమల క్షేత్రానికి తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందని పలుమార్లు కేంద్ర నిఘా వర్గాలే హెచ్చరించాయి. తిరుమల భద్రతను కట్టుదిట్టం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ఆకాశమార్గం వైపు నుంచి కూడా తిరుమలకు ముప్పు ఉండవచ్చునన్నది కూడా ఒక అంచనా. అందుకే విమాన రాకపోకలను నిషేధించాలని కొందరు కోరుతున్నారు. దీంతో పాటు పవిత్రమైన శ్రీవారి ఆలయం మీదుగా మనిషి ఎగిరిపోవడం ఏమీటన్నది సనాతనవాదుల వాదన. 
 
2012 సంవతత్సరంలో ఒక విమానం సరిగ్గా ఆనంద నిలయం మీదుగా ఎగిరిపోయింది. దీంతో ఆందోళన మొదలైంది. అప్పుడే తితిదే కేంద్ర పౌర విమానయానశాఖకు లేఖ రాసింది. తిరుమలను నో ఫ్లెయింగ్‌ జోన్‌గా ప్రకటించాలని కోరింది. అప్పటి నుంచి ఆ లేఖ పెండింగ్‌లో ఉంది. తాజాగా దీనిపై నిర్ణయం తీసుకుంది. తిరుమలను నో ఫ్లెయింగ్‌ జోన్‌ ప్రకటించలేమని, అలా చేస్తే విమానయానానికి ఇబ్బందులు ఎదురవుతాయని తేల్చిచెప్పింది.
 
కేంద్ర పౌర విమానయాన శాఖ ముందు నో ఫ్లెయింగ్‌ జోన్‌ కోసం అనేక ప్రతిపాదనలున్నాయి. పూరి జగన్నాథుని ఆలయ నిర్వాహకులు ఎప్పటి నుంచో ఈ డిమాండ్‌ చేస్తున్నారు. స్థానికుల ఆందోళనలు కూడా చేపట్టారు. ఇది ఆ రాష్ట్ర శాసనసభలో చర్చ దాకా వెళ్ళింది. భువనేవ్వర్‌ విమానాశ్రయ సమీపంలో ఉన్న 11వ శతాబ్దం నాటి లింగరాజు ఆలయ పరిసరాలను నో ఫ్లెయింగ్‌ జోన్‌గా ప్రకటించాలన్న డిమాండ్‌తో అక్కడ భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. కేరళలోని పద్మనాభస్వామి ఆలయ పరిసరాలలోను విమాన రాకపోకలు నిషేధించాలని ఆలయ నిర్వాహకులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 
 
అలాగే తాజ్‌ మహల్‌కు సంబంధించి కూడా ఇలాంటి డిమాండ్‌ ఉంది. అత్యంత విలువైన, అపురూపమైన తాజ్‌మహల్‌ భారత పురావస్తు శాఖ పరిరక్షణలో ఉంది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు భద్రత కల్పిస్తున్నాయి. ఒకసారి అత్యంత తక్కువ ఎత్తులో, తాజ్‌మహల్‌కు సమీపంలో ఓ విమానం ప్రయాణం చేసింది. దీంతో దీన్ని నో ఫ్లెయింగ్‌ జోన్‌గా ప్రకటించాలని భారత పురావస్తు శాఖ, సిఐఎస్‌ఎఫ్‌ కేంద్రాన్ని కోరాయి. అయినా నో ఫ్లెయింగ్‌ జోన్‌గా ప్రకటించలేదు. అనధికారికంగా మాత్రం తాజ్‌మహల్‌కు 2.5 కిలోమీటర్ల పరిధిలో విమానాలు ఎగురకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంకా దేశంలో పలు ఆలయాలు, పురాతన కట్టడాలకు సంబంధించి కూడా నో ఫ్లెయింగ్‌ జోన్‌ డిమాండ్లు ఉన్నాయి.
 
దేశంలో పార్లమెంట్ భవనం, రాష్ట్రపతి భవనం, ప్రధానమంత్రి నివాసం, అణు విద్యుత్‌ కేంద్రాలు, రక్షణ, పరిశోధనా కేంద్రాలు తదితర వాటిని నో ఫ్లెయింగ్‌ జోన్‌గా ప్రకటించారు. దేశంలో ఇప్పటికే 280కి పైగా ఇలాంటి జోన్లు ఉన్నాయి. ఈ జోన్లు ఇంకా పెరిగితే విమానయానానికి ఇబ్బందులు ఎదురవుతాయని ఆ శాఖ చెబుతోంది. ఇందులో వాస్తవం లేకపోలేదు. ఒక ఆలయాన్ని నో ఫ్లెయింగ్‌ జోన్‌ పరిధిలోకి తెస్తే అనేక ఆలయాల నుంచి ఇలాంటి డిమాండ్లు ముందుకొస్తాయి. 
 
దేశంలో ముంబైలోని పార్సీ మతస్తులకు చెందిన టవర్‌ ఆఫ్‌ సైలెన్స్ తప్ప మరే ఇతర కట్టడాన్ని నో ఫ్లెయింగ్‌ జోన్‌గా ప్రకటించలేదు. భారత దేశంలో ఏ ఆలయమైనా పవిత్రమైనదే. కాంచీపురం వెళితే..వందలసంఖ్యలో ఆలయాలున్నాయి. అన్నీ పురాతనమైనవే. ప్రాచీన కట్టడాలు అలాంటివే ఉన్నాయి. అంతెందుకు రేణిగుంట సమీపంలోని గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం క్రీస్తుపూర్వం నాటిది. ఇంతటి పురాతన శివాలయం దేశంలో ఎక్కడా లేదు. మన రాష్ట్రంలో శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గమ్మ, సింహాచలం, అన్నవరం లాంటి ప్రముఖ ఆలయాలున్నాయి. 
 
తమిళనాడులో కంచితో పాటు తిరుత్తణి, మధురై, రామేశ్వరం, శ్రీ రంగం, చిదంబరం, తిరువణ్ణామలై ఇలా లెక్కకు మించిన ఆలయాలున్నాయి. కేరళలో పద్మనాభస్వామి ఆలయంతో పాటు అయ్యప్ప ఆలయం ప్రముఖమైనది. కర్ణాటకలో ధర్మస్థలం, మైసూరు దర్గాదేవి వంటి ఆలయాలున్నాయి. దేశ వ్యాప్తంగా చూస్తే వందల సంఖ్యలో ప్రముఖ ఆలయాలున్నాయి. ఇక ఇతర మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలు లెక్కలోకి తీసుకుంటే దీనికి అంతే ఉండదు. అందుకే ఆలయాలు ప్రార్థనా మందిరాలున్నా ప్రాంతాలను నో ఫ్లెయింగ్‌ జోన్‌గా ప్రకటిస్తే పౌర విమానయానయానికి ఇబ్బందులు తప్పవు. ఇదే విషయాన్ని కేంద్రం చెబుతోంది.
 
దేశంలో విమానయాన్ని విస్తరించాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యోచన. ఇందులో భాగంగానే చిన్న చిన్న విమానాశ్రయాలు ఏర్పాటవుతున్నాయి. మన రాష్ట్రంలో కడప, కుప్పం, నెల్లూరు, భోగాపురం ఇలా అనేక ప్రాంతాల్లో విమానాశ్రయాలు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. బస్సుల్లాగా ఎయిర్‌ బస్సులు తిరగాలన్నది ప్రభుత్వాల యోచన. ఇలాంటప్పుడు అడుగడుగునా నో ఫ్లెయింగ్‌ జోన్‌ ఉంటే విమాన రాకపోకలకు ఆటంకం, అంతరాయం తప్పదు. తిరుపతిని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించారు. ఆ స్థాయిలో అభివృద్థి చేయాలని యోచిస్తున్నారు. విదేశీ విమానాలూ తిరుపతికి రాకపోకలు సాగించాలన్నది దీని ఆలోచన. 
 
తిరుపతికి భౌగోళికంగాను పరిమితులున్నాయి. చుట్టూ కొండలే. ఇటు హైదరాబాద్‌, ముంబై వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే విమానాలు ఖచ్చితంగా శేషాచలం కొండలను దాటాల్సిందే. అదీ గాక విమానయాన చట్టాల ప్రకారం గగనతలంపై ఆయా దేశాలకే పూర్తి అధికారం ఉండదు. దానికీ పరిమితులుంటాయి. ఆయా దేశాలతో ఉన్న ఒప్పందాల ప్రకారం విమానాలు ఎగరడానికి అధికారం ఉంటుంది. అడుగడుగునా నో ఫ్లెయింగ్‌ జోన్‌ ఉంటే విమానయాన సంస్థలు విమానాలు నడవడానికి సిద్థపడవు. తితిదే సహా పలు ఆలయాల అభ్యర్థనను కేంద్రం తిరస్కరించడానికి ఇవీ కారణాలే.
 
విమానాల ఫ్లై జోన్‌ను మూడు రకాలుగా వర్గీకరించారు. ప్రొహిబిటెడ్‌, రిస్ట్రిక్టెడ్‌, డేంజరెస్‌ జోన్లుగా విభజించారు. ప్రొహిబిటెడ్‌ జోన్లలో విమాన రాకపోకలు పూర్తిగా నిషిద్ధం. నిర్ణీత వేళల్లో మాత్రమే విమానాల రాకపోకలు సాగించే అవకాశముండే ప్రాంతాన్ని రిస్ట్రిక్టెడ్‌ జోన్‌ అంటారు. డేంజరస్‌ జోన్‌ అంటే అక్కడ విమాన రాకపోకలు సాగించడం ప్రమాదకరం. అనివార్య పరిస్థితుల్లో ఇలాంటి చోట అనుమతి ఇస్తారు. సైనిక స్థావరమున్న చీరాల, అంతరిక్ష ప్రయోగశాల జరిగే శ్రీహరికోట ప్రాంతాలు డేంజరెస్‌ జోన్‌ కింద ఉన్నాయి. చెన్నై సమీపంలోని కల్పాకం అణు విద్యుత్‌ కేంద్రం నో ఫ్లెయింగ్‌ జోన్‌ కేటగిరిలో ఉంది. ఆ కేంద్రానికి 10 కిలోమీటర్ల పరిధిలో విమాన రాకపోకలు నిషేధించారు.
 
తిరుమల సమస్యకు పరిష్కారం ఒక్కటే కనిపిస్తోంది. తాజ్‌మహల్‌ నమూనా పరిష్కారమే. తిరుమల కొండలు మొత్తం కాకున్నా తిరుమల క్షేత్రం పరిధి వరకైనా విమానాల రాకపోకలు సాగించకుండా అనధికారికంగా నిషేధం విధించేందుకు తితిదే అధికారులు, ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. తిరుమల పవిత్రత, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే విమానాలను తిరుమల క్షేత్రం వైపు వెళ్ళకుండా రేణిగుంట విమానాశ్రయ అధికారులు జాగ్రత్త తీసుకుంటున్నారు.