శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : శనివారం, 19 సెప్టెంబరు 2015 (10:56 IST)

చంద్రబాబు హెచ్చరికలు... ఎవరి పదవికి మూడుతుందో...?

నిన్న మంత్రి వర్గ సమావేశంలో... నేడు కలెక్టర్ల సమావేశంలో... అంతకు ముందు మరోచోట. చంద్రబాబు మంత్రులకు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. పని తీరు మార్చుకోమని హెచ్చరిస్తూనే ఉన్నారు. వీటి అర్థం ఏంటి? దీని వెనుక ఉన్న నిగూఢమైన నిజమేంటి..? ఎవరి పదవికి మూడనున్నది. అదంతా చంద్రబాబు మది దాగి ఉన్న మర్మమే.. దసరా తరువాత తేలే అవకాశం ఉంది. తరువాతే కొందరికి పదవీ గండం మరికొందరికి పదవి యోగం పట్టనున్నాయి. 
 
ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశాలు, కేబినెట్ సమావేశాలలో వివిధ శాఖలకు హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా శుక్రవారం విజయవాడలో జరిగిన సమావేశంలో కూడా రెవెన్యూ శాఖకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అంతే కాదు. అవినీతి పరులంటూ మండిపడ్డారు. అంతటితో ఆగలేదు. ఆరోగ్యశాఖలో ఎలుకలు, కుక్కల చిన్నపిల్లలను పీక్కుతుంటుంటే ఏం చేస్తున్నట్లంటూ ఫ్రశ్నించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది నిజంగానే శాఖా పరంగా జరిగిన తప్పిదాలపై చేసిన వ్యాఖ్యలేనా లేక మరే ఇతర పరిస్థితులు ఉన్నాయా అనే అనుమానాలు ఉన్నాయి. అందుకు బలమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి. 
 
ఏపీ డిప్యూటీ సీఎం కె.కృష్ణమూర్తి రెవెన్యూ శాఖను చూస్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తికి, చంద్రబాబుకు మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయనేది సత్యం. రాజధాని విషయంలో పలుమార్లు కామెంట్లు చేసిన కేఈపై చంద్రబాబు అసంతృప్తితోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల డిప్యూటీ కలెక్టర్ల వ్యవహారంలో ఆ శాఖ మంత్రి జారీ చేసిన ఉత్తర్వులను బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రద్దు చేయడంతో వివాదం మరింత రాజుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా శుక్రవారం విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో రెవెన్యూశాఖ తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన అసంతృప్తిని వ్యక్తం చేశారట. గడిచిన రెండేళ్లుగా ఆ శాఖ పనితీరు ఆశించినంతగా లేదని, అడుగడుగునా అవినీతిమయంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 
 
అంతటితో ఆగని చంద్రబాబు ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల తీరుపై కూడా మండిపడ్డారు. అలాగే సమాచార శాఖకు చురకలు అంటించారు. మొత్తంపై వీటి వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దసరా తరువాత మంత్రివర్గంలో మార్పులు ఉండవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు ప్రణాళిక బద్ధంగానే కామెంట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే శాఖలలో మార్పులు ఖాయమని తెలుస్తోంది. ఏమౌతుందో చూద్దాం.. !