శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : ఆదివారం, 23 ఆగస్టు 2015 (12:15 IST)

ప్రత్యేక హోదా కంటే ముందు ప్యాకేజీపైనే ఏపీ సర్కారు దృష్టి.. ఎందుకు?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీలు పట్టుబడుతున్న తరుణంలో.. ఏపీ సర్కారు మాత్రం హోదా కంటే కూడా ప్యాకేజీపైనే దృష్టి పెడుతోంది. హోదా కంటే ముందు ప్యాకేజీని రాబట్టాలని అప్పుడే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందనే వాదనతో ఏపీ గవర్నమెంట్ ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 25వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక భేటీలో ప్యాకేజీని రాబట్టే విషయమై చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. 
 
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అయినా, ప్యాకేజీ అయినా ఈ భేటీలోనే నిర్ణయం జరగనుంది. అత్యంత కీలకమైన ఈ భేటీలో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ముందుగా ప్యాకేజీ కోసం పట్టుబట్టి, అనుకున్న మేర నిధులు సాధించుకున్న తర్వాతే ‘హోదా’పై మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై నివేదిక కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. 
 
ప్రత్యేక హోదాతో కేవలం కొన్ని రాయితీలు మాత్రమే వస్తాయని ఏపీ అధికారులు అంటున్నారు. అందుకే ప్యాకేజీ కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రత్యేక హోదా దేశంలోని 11 రాష్ట్రాలకు ఉందని, ‘హోదా’తో ఆయా రాష్ట్రాలకు చేకూరిన లాభం స్వల్పమేనని గణాంకాలతో వాదిస్తున్నారు. అదే ప్రత్యేక ప్యాకేజీ విషయంలో అనుకున్న అంశాలకు కేంద్రాన్ని ఒప్పించగలిగితే పెద్ద ఎత్తున నిధులు వచ్చే అవకాశాలున్నాయని ఏపీ సర్కారు అంటోంది. 
 
ప్రస్తుతం వివిధ అంశాల కింద ప్రత్యేక ప్యాకేజీని కోరనున్న చంద్రబాబు మొత్తం మీద రూ.25 వేల కోట్ల మేర సహాయాన్ని కోరనున్నారని సమాచారం. ఈ మేరకు ప్రధాని నుంచి హామీ లభించిన తర్వాత ‘హోదా’పై గళం విప్పాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరి ప్రధాని ముందు ఏపీ సర్కారు వ్యూహాత్మక ఎత్తుగడకు ఏ మేరకు సఫలం చేస్తారో వేచి చూడాలి.