శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2016 (15:53 IST)

ఎరుపెక్కుతున్న చిత్తూరు జిల్లా రహదారులు... కారణం ఎవరు?

రోడ్లు ఎరుపెక్కుతున్నాయి. బయటకు రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. మృత్యువు రోడ్డుపై ఎక్కడ మాటు వేసిందోనన్న భయం వాహనదారులను వెంటాడుతోంది. చిత్తూరు జిల్లాలో రోడ్డుప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇం

రోడ్లు ఎరుపెక్కుతున్నాయి. బయటకు రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. మృత్యువు రోడ్డుపై ఎక్కడ మాటు వేసిందోనన్న భయం వాహనదారులను వెంటాడుతోంది. చిత్తూరు జిల్లాలో రోడ్డుప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇంతకీ రోడ్డుప్రమాదాలు ఎక్కువగా జరగడానికి కారణాలేంటి...
 
చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి జాతీయ రహదారులపైనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇందులో వాహనదారుల నిర్లక్ష్యం కొంత ఉంటే ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో లోపాలు కూడా కనిపిస్తున్నాయి. తిరుపతి పర్యాటక ప్రాంతంకావడంతో ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తిగత వాహనాల్లో ఎక్కువగా యాత్రికులు వస్తుంటారు. డ్రైవర్‌ లేకుండా సొంత వాహనాలను స్వయంగా నడుపుకురావడంతో అలిసిపోయి ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. 
 
దానికి తోడు రాత్రి బయలుదేరి తెల్లవారుజామునే స్వామివారి సన్నిధికి చేరుకోవాలని ఆతృతతో వస్తున్న వారు ఎక్కువగా ఉండడంతో వేకువజామునే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటికి వాహనదారుల నిర్లక్ష్యం కొంత అయితే ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన చర్యలలో లోపాల కారణంగా మరికొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. 
 
ముఖ్యంగా జాతీయ రహదారుల్లో విపరీతమైన వేగంతో రావడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవేలో గ్రామాలు వచ్చిన ప్రాంతాల్లో సబ్‌వేలు ఏర్పాటుచేయకపోవడంతో ఆ గ్రామాల నుంచి వాహనాలు హైవే నుంచి వస్తుండటం వల్ల కూడా ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. రోడ్ల నిర్మాణంలో సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, వర్షాలు వచ్చి అక్కడక్కడా రోడ్లు దెబ్బతిన్నప్పుడు వాటిని వెంటనే మరమ్మత్తులు చేసే ప్రయత్నం చేయకపోవడం వల్ల కూడా రోడ్డుప్రమాదాలు తరచూ జరుగుతూ ఉన్నాయి.
 
చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుమల వంటి యాత్రా ప్రదేశాలు ఎక్కువగా ఉండటంతో నిత్యం యాత్రికులు వస్తూ ఉంటారు. ఆ విధంగా వాహనాల రద్దీ కూడా పెరిగిపోతుండటం ప్రమాదాలకు కారణమవుతోంది.