శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: బుధవారం, 23 నవంబరు 2016 (17:00 IST)

కొత్తనోట్ల కోసం తన్నులాటలు... RBI గవర్నర్ ఉర్జీత్ పటేల్ ఫెయిల్యూర్స్... తీసేస్తారా...?

పెద్ద నోట్లు... రూ. 500, రూ. 1000 రద్దు చేసేటపుడు పెద్ద ఘనకార్యం అనుకున్నారంతా. కానీ రద్దు చేసిన నవంబరు 8 నుంచి ఇప్పటివరకూ అంటే 15 రోజులు కావస్తున్నా డబ్బు కోసం జనం రోడ్లపై క్యూల్లో నిలబడి నరక యాతన అనుభవిస్తున్నారు. పెళ్లి చేయాలనుకున్నవారి ఇంట్లో పచ్

పెద్ద నోట్లు... రూ. 500, రూ. 1000 రద్దు చేసేటపుడు పెద్ద ఘనకార్యం అనుకున్నారంతా. కానీ రద్దు చేసిన నవంబరు 8 నుంచి ఇప్పటివరకూ అంటే 15 రోజులు కావస్తున్నా డబ్బు కోసం జనం రోడ్లపై క్యూల్లో నిలబడి నరక యాతన అనుభవిస్తున్నారు. పెళ్లి చేయాలనుకున్నవారి ఇంట్లో పచ్చనోట్లు లేకపోవడంతో కొన్ని పెళ్లిళ్లు ఆగిపోయాయి. వారంతా బోరుమని ఏడుస్తున్నారు. ఇక రైతులకైతే విత్తనాలు కొనేందుకు డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
చిరు వ్యాపారుల వ్యాపారం పూర్తిగా పడకేసింది. ఎక్కడ చూసినా నగదు కొరత ప్రభావం తీవ్రరూపం దాల్చడంతో అంతా అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. నల్లడబ్బును తరిమేసేందుకే అంటూ రద్దును ప్రకటించినప్పటికీ సామాన్యులకు ఎదురయ్యే కష్టాలను ముందుగా పసిగట్టడంలో ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ పూర్తిగా విఫలమయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. 130 కోట్ల భారతదేశ ప్రజల్లో బ్యాంకుల్లో ఖాతాలున్నవారి సంఖ్య 60 శాతానికి మించి లేదని గణాంకాలు చెపుతున్నాయి. మరి మిగిలిన 40 శాతం మంది ప్రజలు డబ్బులు మార్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. బ్యాంకులకు వెళితే వీరి ముందు కనిపించే నిబంధనలతో పిచ్చెక్కిపోతోంది.
 
పాతనోట్లను డిపాజిట్ చేసి కొత్త నోట్లను పొందేందుకు, ఉన్న డబ్బును తమ ఖాతాల నుంచి తీసుకునేదుకు జనం భారీగా బ్యాంకులు ముందు క్యూ కడుతున్నారు. నోట్ల రద్దుతో కొన్నిచోట్ల తలెత్తిన ఘర్షణలు, మరికొన్నిచోట్ల చోటుచేసుకున్న సమస్యలు మూలంగా దేశవ్యాప్తంగా 70 మందికి పైగా మరణించారు. దీనితో విపక్షాలు ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్నాయి. కాగా పాతనోట్లను రద్దు చేస్తే ఆ స్థానంలో కొత్తనోట్లు ప్రవేశపెట్టేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవడంలో ఉర్జిత్ విఫలమయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. 
 
రూ. 2000 నోటుకు బదులు, రూ. 500 నోట్లు ముందుగా ముద్రించి విడుదల చేసి ఉన్నట్లయితే ప్రజలు చిల్లర కోసం ఇబ్బందులు పడాల్సి వచ్చేది కాదు. అన్నిటికీ మించి పెద్దనోట్లను రద్దు చేయాలనుకున్నప్పుడు ముందుగానే రూ. 100, రూ. 50 నోట్లు ముద్రించి బ్యాంకులకు పంపించి ఉన్నట్లయితే ఇపుడు సామాన్యులు ఇలా రోడ్లపై నిలబడే కష్టం ఉండేది కాదు. 70 మంది మృత్యువాత పడేవారూ కాదు. 
 
ఇలా ప్రస్తుతం నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న సమస్యలన్నిటికీ ముందుచూపు లేని ఉర్జీత్ పటేల్ నిర్ణయాలే కారణమనే చర్చ జరుగుతోంది. ఆయనకు ఆర్బీఐ గవర్నరుగా కొనసాగే అర్హత లేదంటూ ఆల్ ఇండియా బ్యాంకుల సమాఖ్య ఇప్పటికే ఓ ప్రకటన కూడా చేసింది. ఇంకోవైపు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన దగ్గర్నుంచి నోట్ల రద్దు అంశమే సభలను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్‌ను సాగనంపుతారనే చర్చ కూడా సాగుతోంది. ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.