శాశ్వత నిద్రలోకి తమిళ రాజకీయ యోధుడు కరుణానిధి...
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ముత్తవేల్ కరుణానిధి శాశ్వతనిద్రలోకి జారుకున్నారు. ఆయనకు వయసు 95 యేళ్లు. గత యేడాదిన్నరకాలంగా అనారోగ్యంతో పాటు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన జూలై నెల 27వ తే
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ముత్తవేల్ కరుణానిధి శాశ్వతనిద్రలోకి జారుకున్నారు. ఆయనకు వయసు 95 యేళ్లు. గత యేడాదిన్నరకాలంగా అనారోగ్యంతో పాటు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన జూలై నెల 27వ తేదీన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను చెన్నైలోని కావేరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చారు.
అప్పటినుంచి క్రిటికల్ కేర్ వార్డులో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన సోమవారం సాయంత్రం ఉన్నట్టుండి ఆయన మళ్లీ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీనికితోడు ఆయన శరీరంలోని అంతర్గత అవయవాలు కూడా పనితీరు కూడా గణనీయంగా తగ్గిపోయింది. దీంతో వైద్య చికిత్సలకు కూడా స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం రాత్రి కన్నుమూశారు.
కాగా, 1924, జూన్ మూడో తేదీన ముత్తువేల్ - అంజుగం దంపతులకు తిరుక్కువలై నాగపట్టణం జిల్లాలో జన్మించారు. ఆయన చిన్నవయసు నుంచి డ్రామాలు, నాటక, సాహిత్యంపై ఎంతో ఆసక్తి చూపుతూ వచ్చారు. ఆ తర్వాత జస్టీస్ పార్టీకి చెందిన యోధుల్లో అళగిరి స్వామిని స్ఫూర్తిగా తీసుకున్న కరుణానిధి... తన 14వ యేటనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. అలా అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చిన కరుణానిధి డీఎంకేలో 1949 సంవత్సరంలో చేరారు.
1967లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత కరుణానిధి తన 33 యేటలోనే రాష్ట్ర ప్రజా పనుల శాఖామంత్రిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 1969లో అన్నాదురై మరణానంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు పార్టీలో వివిధ పదవులను చేపట్టారు. అంతేకాకుండా, నాటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే, హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని జైలుపాలయ్యారు.
పిమ్మట అన్నాదురై మరణానంతరం డీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆ పార్టీకి 50 యేళ్లుగా అధ్యక్షుడిగా కొనసాగుతూ సరికొత్త రికార్డును నెలకొల్పారు. అలాగే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్ళపాటు కొనసాగారు. 1969 నుంచి 2011 మధ్యకాలంలో ఈయన రాష్ట్ర సీఎంగా పని చేశారు.
నాలుగో అసెంబ్లీ కాలంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కరుణానిధి 1969 ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 1971 జనవరి 5వ తేదీ వరకు సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత ఐదో అసెంబ్లీ కాలంలో కరుణానిధి రెండోసారి 1971 మార్చి 15న సీఎంగా బాధ్యతలు స్వీకరించి 1976 జనవరి 31వ తేదీ వరకు కొనసాగారు.
ఆ తర్వాత ఆరు, ఏడు అసెంబ్లీల కాలంలో విపక్ష నేతగా ఉన్న కరుణానిధి తొమ్మిదో అసెంబ్లీ కాలంలో అంటే 1989 జనవరి 27వ తేదీన సీఎంగా బాధ్యతలు స్వీకరించి 1991 జనవరి 30వ తేదీ వరకు కొనసాగారు. ఆ తర్వాత 11వ అసెంబ్లీకాలంలో 1996 మే 13వ తేదీ నుంచి 2001 మే 14వ తేదీ వరకు నాలుగోసారి సీఎంగా ఉన్నారు. 13వ అసెంబ్లీ కాలంలో 2006 మే 13వ తేదీ నుంచి 2011 మే 14వ తేదీ వరకు ఐదోసారి సీఎంగా ఉన్నారు.
కరుణానిధి వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే, ఈయనకు ముగ్గురు భార్యలు. తొలి భార్య పేరు పద్మావతి అమ్మాళ్. ఈమెకు ఒక్క కుమారుడు. ఆయన పేరు ఎంకే.ముత్తు. రెండో భార్య పేరు దయాలు అమ్మాళ్. ఈమెకు నలుగురు పిల్లలు. వీరిలో ఎంకే అళగిరి, ఎంకే స్టాలిన్, ఎంకే తమిళరసు, ఎంకే సెల్వి. మూడో భార్య పేరు రాజాత్తి అమ్మాళ్. ఈమెకు ఒక్క కుమార్తె. ఈమె పేరు ఎంకే. కనిమొళి. వీరిలో ఎంకే స్టాలిన్ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండగా, ఎంకే అళగిరి కేంద్ర మాజీ మంత్రిగా పని చేశారు. ఎంకే కనిమొళి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.