శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : బుధవారం, 16 నవంబరు 2016 (11:29 IST)

హైకోర్టు గడపకెక్కిన తిరుమల ధరల పంచాయతీ...

తిరుమలలో హోటళ్ళు, దుకాణాలలో ఆహార పదార్థాలు ఇతర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా తితిదే స్పందించని నేపథ్యంలో వ్యవహారం హైకోర్టు దాకా వెళ్ళింది. దీనికి సంబంధించి న్యాయస్

తిరుమలలో హోటళ్ళు, దుకాణాలలో ఆహార పదార్థాలు ఇతర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా తితిదే స్పందించని నేపథ్యంలో వ్యవహారం హైకోర్టు దాకా వెళ్ళింది. దీనికి సంబంధించి న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. ఉమ్మడి న్యాయస్థానం (ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం) ఈ వ్యాజ్యంపై స్పందించింది. అధిక ధరలపై 2010లో విజిలెన్స్ డిఎస్పీ ఇచ్చిన నివేదికను కోర్టుకు సమర్పించాల్సిందిగా తితిదేని ఆదేశించింది.
 
తిరుమలలోని హోటళ్ళు, దుకాణాలపై ఎప్పటి నుంచో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమలలో రెండు రకాల హోటళ్ళు ఉన్నాయి. టెండర్లు ద్వారా అప్పగించిన హోటళ్ళు కొన్ని ఉంటే స్థానికులకు కల్పించిన ఉపాధిలో భాగంగా దుకాణ గదులను తీసుకుని చిన్నపాటి ఫాస్ట్ ఫుడ్‌ సెంటర్లు నిర్వహిస్తున్నవి కొన్ని ఉన్నాయి. టెండర్లు ద్వారా సాధించుకున్న హోటళ్ళలో తితిదే నిర్ణయించిన ధరలకే ఆహార పదార్థాలు విక్రయించాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధన అమలవుతున్న దాఖలాలు లేవు. కొన్ని హోటళ్లలో నిర్ణీత ధరల కంటే 300 శాతం - 500 శాతం అధిక ధరలు వసూలు చేస్తున్నారని హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం సారాంశం. 
 
అదేవిధంగా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో ధరల నియంత్రణ లేదు గానీ ఏ వ్యాపారం చేయడం కోసమైతే లెసెన్సులు తీసుకున్నారో ఆ వ్యాపారం మాత్రమే చేయాలన్న నిబంధన ఉంది. ఇది కూడా అమలు కాలేదన్నది ఫిర్యాదు దారుని ఆరోపణ. గతంలో డయల్‌ యువర్‌ ఈఓ కార్యక్రమంలోనూ హోటళ్ళలో ధరలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయి.
 
తిరుమలలో దుకాణాలు, హోటళ్ళు సంబంధించి 2010లో పనిచేసిన విజిలెన్స్ డిఎస్పీ ఒక నివేదిక రూపొందించారు. దాన్ని బయటపెట్టాలని ఫిర్యాదు దారుడు కోరుతున్నారు. సమాచార హక్కు చట్టం కింద తాను ఆ నివేదికను అడిగినా తితిదే అధికారులు ఇవ్వలేదని పేర్కొన్నారు. రాజకీయ కారణాల వల్ల ఆ నివేదికలోని అంశాలను అమలు కూడా చేయలేదని కోర్టుకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం కాస్త తీవ్రంగానే స్పందించింది. ఆ నివేదికను తమ ముందుంచాలని ఆదేశించింది. ఈ వ్యవహారాన్ని తామే స్వయంగా పర్యవేక్షిస్తామని న్యాయమూర్తులు చెప్పడం గమనార్హం. ఈ అంశాన్ని కోర్టు ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నదో దీంతో అర్థమవుతుంది.
 
తిరుమల హోటళ్ళలో అధిక ధరలపై ఫిర్యాదులు అందుతున్నా తితిదే అధికారులు స్పందించకపోవడానికి రెండు  కారణాలున్నాయి. హోటళ్ళ నిర్వాహకులతో కిందిస్థాయి అధికారులు కుమ్మక్కవడం ఒక కారణమైతే తితిదే అన్నప్రసాద వితరణను భారీగా విస్తరించింది. ఉదయం అల్పాహారం కూడా అందజేస్తోంది. రోజుకకు 60 వేలు - 70 వేలు భోజనాలు, టిఫిన్లు అందజేస్తోంది. శ్రీవారి భక్తులెవరూ హోటళ్ళకు వెళ్ళి భోజనం చేయాల్సిన అవసరం లేదన్నది తితిదే వాదన.

ఇది వాస్తవం కూడా. అన్నప్రసాద కేంద్రానికి వెళ్ళడం ఇష్టం లేని వారు, సమయాభావంతో వెళ్ళలేని వారు మాత్రమే బయట తినడానికి ఆశక్తి చూపుతున్నారు. అందుకే ధరలపై తితిదే కాస్త చూసీచూడనట్లు ఉంటోంది. అయినా ఈ అంశంలో హైకోర్టు కలుగజేసుకున్న నేపథ్యంలో తితిదే ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.