శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శనివారం, 21 నవంబరు 2015 (10:39 IST)

అవినీతి (లాలూ)ని ఆలింగనం చేసుకున్న అరవింద్ కేజ్రీవాల్.. సోషల్ మీడియాలో విమర్శలు

"ఒకరిది అవినీతి చరిత్ర. మరొకరిది అవినీతి వ్యతిరేక పోరాట చరిత్ర. ఇద్దరూ ఒక్కచోట కలిసి కౌగిలించుకొని ముచ్చట్లు చెప్పుకుంటే... బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమార్ ప్రమాణస్వీకారం సందర్భంగా లాలూ - కేజ్రీవాల్‌ ఎంతో ఆప్యాయంగా కనిపించారు. వీళ్ల సాన్నిహిత్యానికి నెటిజన్లు పెట్టిన పేరు ఏంటో తెల్సా? అవినీతిని వాటేసుకున్న క్రేజీవాల్‌". దీంతో దేశ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అనే కామెంట్స్ సోషల్ నెట్‌వర్క్ సైట్లలో హల్‌చల్ చేస్తున్నాయి. 
 
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ ఓ అరుదైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ నితీశ్‌ను అభినందించేందుకు పనిగట్టుకొని మరీ పాట్నా వచ్చాయి. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మొదలు సెక్యూలర్ ఫోర్స్ అంతా స్టేజ్‌పై కనిపించాయి. 
 
ఈ నేతలందరి ఫోకస్ మాత్రం ఇద్దరు నేతలపైనే కేంద్రీకృతమైంది. వాళ్లిద్దరే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. వీళ్లిద్దరూ ఒకరికొకరు ఎదురుపడి పలకరించుకోవడమే కాదు... షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. సాధారణంగా అయితే ఇందులో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. కానీ వీళ్లిద్దరి బ్యాగ్రౌండ్ తెలిసినవాళ్లకు మాత్రం ఈ సీన్ చూసిన తర్వాత చిర్రెత్తుకొచ్చింది. అంతే సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 
 
అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడిగా గతంలో లాలూప్రసాద్ యాదవ్‌పై కేజ్రీవాల్ ఓ స్థాయిలో విరుచుకుపడ్డారు. దాణా కుంభకోణంలో రూ.కోట్లు బొక్కేసిన లాలూకు కేవలం 25 లక్షల ఫైన్... కొద్ది కాలం మాత్రమే జైలు శిక్ష విధించారని... వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. రెండేళ్లు తిరిగే సరికి అదే లాలూతో చేతులు కలిపారు కేజ్రీవాల్. దీనిపైనే నెటిజన్లు కేజ్రీవాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
షేమ్ షేమ్ అంటూ ట్వీట్లపై ట్వీట్లు చేస్తున్నారు. కేవలం బీజేపీని వ్యతిరేకించేందుకే కేజ్రీవాల్... లాలూ పంచన చేరారా అంటూ మండిపడుతున్నారు. ఇదేనా అరవింద్ కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక ఉద్యమ లక్ష్యం అంటూ ఘాటైన విమర్శనాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. కానీ ఆప్ మాత్రం ఈ కామెంట్స్‌ను లైట్‌గా తీసుకుంది. కావాలనే కొందరు నెగెటివ్ ప్రచారం చేస్తున్నారంటూ ప్రతిదాడికి దిగింది.