శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Modified: మంగళవారం, 19 జులై 2016 (14:07 IST)

ఆమె ఉరి వేసుకుంది... కాపాడుదామని వస్తే కాటికి పంపారు... చట్టంతో పనిలేదా...? కుమ్మేయడమేనా...?

గుంటూరు : మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. ఈ పాట ఇపుడు స‌జీవ చిత్రంలా క‌ళ్ళ‌ముందు క‌ద‌లాడుతోంది. మానవత్వం నశించిపోతోంది. ఉన్మాదంతో మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం మహ్మదీయపాలె

గుంటూరు : మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. ఈ పాట ఇపుడు స‌జీవ చిత్రంలా క‌ళ్ళ‌ముందు క‌ద‌లాడుతోంది. మానవత్వం నశించిపోతోంది. ఉన్మాదంతో మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం మహ్మదీయపాలెంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంటే, ఆ గ్రామస్తులు ఇందుకు కారణమంటూ ఇద్దరు యువ‌కుల‌ను బలిచేశారు. గ్రామంలో జాస్మిన్ అనే యువతికి ఇటీవలే పెళ్ళి కుదిరింది. ఆ పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేక‌, మ‌న‌స్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది.
 
ఈ విషయాన్ని తన స్నేహితులకి ముందుగా ఫోన్ చేసి తెలిపింది. కాపాడాలని వచ్చిన శ్రీసాయి, పవన్‍ కుమార్‍‍లను గ్రామస్తులు పట్టుకున్నారు. ఆ బాలికను వీరే అత్యాచారం చేసి చంపి ఉంటారని అనుమానించి చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. పోలీసులు వచ్చినా వినలేదు.. చివరకు నిజం తెలిసింది. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. గ్రామస్తుల చేతిలో చావుదెబ్బలు తిన్న ఇద్దరినీ పోలీసులు ఆస్పత్రికి తరలిస్తుండగా, ఒక యువకుడు మార్గమధ్యంలోనే చనిపోయాడు. మరొకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.. ఎంత దారుణం? 
 
తమ వారికి అన్యాయం జరిగిందన్న ఆక్రోశంలో తప్పులేదు. కానీ కనీసం నిజానిజాలు తెలుసుకోలేని ఉన్మాదస్థాయికి మ‌నుషులు చేరుకోవాలా? నలుగురు కలిస్తే ఉన్మాదం.. ప్రతివాడూ హీరో అయిపోతాడు. తన పరాక్రమాన్నంతా చూపిస్తాడు. అందరూ కలిసి చావబాదుతారు. ఈమధ్య ఇలా చాలా సంఘటనలను చూస్తున్నాం. ఈ దారుణాలను ఆపేందుకు ఏ ఒక్కరూ ప్రయత్నించరు. మనకెందుకులే అని పలాయనవాదం.. మధ్యలో దూరితే నీకేం సంబంధం? తప్పు చేసిన వాడిని సమర్ధిస్తున్నావా? అని అంటారని భయం.. పైగా సెల్ ఫోనుల్లో వీడియోలు.. ఫోటోలు, వీడియోల షూటింగ్.. క్షణాల్లో ఫేస్ బుక్కుల్లో, వాట్సప్పుల్లో పెట్టేసి హీరోయిజంగా ఫీల్ కావటం.. అసలు ఎదుటివాడిని కొట్టే అధికారం ఎవరిచ్చారు.? 
 
పోలీసులకే లేని అధికారాన్ని చేతుల్లోకి తీసుకుని తమలో ఉన్న శాడిజం మొత్తాన్ని చూపించటం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు అని చెప్పాల్సిన సామాజక బాధ్యత ఉన్న జర్నలిస్టులు బాధ్యత మరచి చిత్రీకరించటం.. ఎటువైపు ప్రయాణిస్తున్నాం మనం? ఎవరైనా తన్నులు తింటే బ్రేకింగ్ న్యూసులతో, మ్యూజిక్కులతో ఆ పూట మొత్తం ప్రసారం చేసి రేటింగులు పెంచుకునే టీవీ ఛానళ్ళ రాక్షసానందం.. ఎవరాపాలి ఈ దారుణాల్ని.. తన్నేవాడు.. షూటింగ్ తీసేవాడు.. టీవీలో చూపేవాడు.. అందరికీ ఒకే ఫీలింగ్.. తామేదో న్యాయ‌మూర్తుల్లా జ‌డ్జిమెంట్ ఇచ్చేస్తున్న‌ట్లు భావ‌న‌. నిజమే.. వాళ్ళు తప్పు చేస్తే, పోలీసులకి అప్పగించండి..పోలీసులు పట్టించుకోకపోతే పోరాడండి. 
 
అంతేగానీ రౌడీల్లా.. కేడీల్లా.. అన్నింటికీ మించి ఉన్మాదుల్లా... ఇవేం పనులు? చేతబడులు చేస్తున్నారని, లవ్ లెటర్లు రాశారని, పశువుల చర్మాలు స్మగ్లింగ్ చేస్తున్నారని, అక్రమ సంబంధాలు పెట్టుకున్నారని ఇలా సవాలక్ష కారణాలు.. పట్టుకుని గొడ్లను బాదినట్లు బాదటం.. మళ్ళీ వాటికి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ. సామాజిక మీడియాలో.. టీవీల్లో ఇలా దారుణంగా దాడులు చేస్తూ మానవహక్కుల్ని కాలరాచే సంఘటనల్ని చూస్తూ అంద‌రూ ఉండిపోవ‌డం బాధాక‌రం. ఇక‌నైనా చ‌ట్టాన్ని గౌర‌వించి... శిక్ష‌లు న్యాయ‌స్థానాలే వేసేలా అంద‌రూ చొర‌వ‌చూపాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంది.